భారత్​–ఆసీస్​

భారత్​–ఆసీస్​
  • నేడే తుదిపోరు
  • హాజరవుతున్న అతిరథ మహారథులు
  • భారీ బందోబస్తు.. ఎయిర్​షోతో మ్యాచ్​ ప్రారంభం

అహ్మదాబాద్: ఆదివారం భారత్​–ఆసీస్​ ఐసీసీ వరల్డ్​ కప్​ మ్యాచ్​కు అంతా సిద్ధమైంది. తుదిపోరులో ప్రధాని నరేంద్రమోడీ, ఆసీస్​ ఉప ప్రధానమంత్రి రిచర్డ్ మార్లెస్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్, అస్సాం ముఖ్యమంత్రులు భూపేంద్ర పటేల్, హిమంత బిశ్వ శర్మ, బీసీసీఐ ఛైర్మన్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరు కానున్నారు. వీరితోపాటు దేశంలోని వీవీఐపీలు, వీఐపీలు, యాక్టర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా హజరుకానున్నారు.


బలాబలాలు..
భారత్​–ఆసీస్​లు ఐసీసీ–2023లో మంచి ఫామ్​లో ఉన్నాయి. భారత్​ అన్ని మ్యాచ్​లను గెలుచుకుంటూ వస్తుండగా, ఆసీస్​ వరుస విజయాలను సాధిస్తూ వస్తోంది. భారత్​ సొంతగడ్డపై మ్యాచ్​ జరగనుండడం ఒక్కటే ప్లస్​ పాయింట్​ తప్పితే మిగతా అంతా ఆటగాళ్ల ఆటతీరులోనే జయాపజయాలు ఇమిడి ఉన్నాయి. అయితే రోహిత్​ సేన విజయంపై ధీమాతో ఉంది. ఇప్పటికే ప్రాక్టీస్​లో ఆసీస్​ను ఎలా మట్టికరిపించాలనే వ్యూహాలతో సిద్ధంగా ఉంది. అదే సమయంలో ఆసీస్​ భారత్​పై గెలుపులో మెరుగైన రికార్డుతో ఉంది. ఈ అంశం ఆసీస్​కు కలిసిరానుంది. ఫైనల్​ మ్యాచ్​లో ఆసీస్​ లబుషేన్​ను తప్పించి అతని స్థానంలో స్టోయినీస్​ను తీసుకునే అవకాశం ఉంది. అయితే స్టోయినీస్​కు భారత్​లోని పిచ్​లపై మంచి అవగాహన ఉండడం ఆసీస్​కు కలిసివచ్చే అంశం.

భారత్​.. 
కాగా బౌలింగ్​లో మహమ్మద్​ షమీ 23 వికెట్లతో ముందువరుసలో ఉండగా, జస్​ప్రీత్​ బూమ్రా 18, రవీంద్ర జడేజా 16 వికెట్లతో మంచి ఊపుమీదున్నారు. మరోవైపు రోహిత్​, కోహ్లీ, గిల్​, కె.ఎల్​.రాహుల్​, అయ్యర్​లు కూడా బ్యాటింగ్​లో బలంగా ఉన్నారు.

ఆసీస్​..
డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్​, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లేన్ మ్యాక్స్‌వెల్​లు బ్యాటింగ్​ విభాగంలో బలంగా ఉండగా, మిడిలార్డర్​లో జోష్​ బలంగా ఉన్నాడు. లోయరార్డర్‌లో స్టోయినీస్, స్టార్క్, ప్యాట్ కమిన్స్​ ఆడనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆడమ్ జంపా ఇప్పటికే 22 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే ప్రధాన ఫేసర్​గా జోష్​ వుడ్​ బౌలింగ్​లో ఏదైనా మ్యాజిక్​ సృష్టించే సత్తా కలిగినవాడు. 
భారీ బందోబస్తు: మ్యాచ్​కు అగ్రనేతలు హజరవుతుండడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అహ్మాదాబాద్​ పోలీస్ కమిషనర్ జ్ఞానేంద్ర సింగ్ మలిక్ వెల్లడించారు. స్టేడియం లోపల 3,000 మంది పోలీసు సిబ్బంది, ఒక కంపెనీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, నగరంలో ట్రాఫిక్ పర్యవేక్షణతోపాటు విమానాశ్రయం వద్ద వీఐపీల రాకపోకలకు ఆటంకం కలగకుండా చర్యలు, హోటళ్లు, రహదారులపై తనిఖీలు నిర్వహించేందుకు మరో ఆరువేల మంది పోలీసు బందోబస్తును వినియోగిస్తామన్నారు. 

మ్యాచ్​ ప్రారంభం..
భారత్​–ఆసీస్​ మ్యాచ్​ నిర్వహణ కార్యక్రమం మధ్యాహ్నం 1:35 నిమిషాల నుంచే ప్రారంభించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. టాస్ తరువాత వైమానిక దళం ఏయిర్​షో నిర్వహించనుంది. ఫస్ట్​ ఇన్నింగ్స్​ బ్రేక్​ టైమ్​లో సింగర్ ఆదిత్య ఘడ్వీ, ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ప్రీతమ్ చక్రవర్తి, జొనితా గాంధీ, నకష్ అజీజ్, అమిత్ మిశ్రా, ఆకాశా సింగ్, తుషార్ జోషిల కార్యక్రమాలుంటాయని బీసీసీఐ స్పష్టం చేసింది. అలాగే లేజర్​ లైటింగ్​ షోలను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది.