గల్ప్ కార్మికుల గోస పట్టించుకోని కేసీఆర్

గల్ప్ కార్మికుల గోస పట్టించుకోని కేసీఆర్

ఉద్యోగాలను భర్తీ చేయలేదు -రైతుల భూములను కాపాడేందుకే కామారెడ్డి నుంచి పోటీ

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : పదేళ్లుగా గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు కేసీఆర్ చర్యలు తీసుకోలేదు...గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయలేదు.. వారి గోసను పట్టించుకోని కేసీఆర్ కు కామారెడ్డి ప్రజలు బుద్ధి చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవి కామారెడ్డి భవిష్యత్తును మార్చే ఎన్నికలని సూచించారు. శనివారం సాయంత్రం ఆయన మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి నియోజకవర్గంలోని రాజంపేట, భిక్కనూర్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లలో పాల్గొన్నారు. ఆయన హెలికాప్టర్ లో రావాల్సి ఉండగా సాంకేతిక లోపం వల్ల కారులో వచ్చారు. దీంతో లింగాపూర్, చిన్న మల్లారెడ్డి గ్రామాల్లో జరిగిన కార్నర్ మీటింగ్ ల్లో హాజరు కాలేకపోయారు. రాజంపేట లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల కుటుంబాలు, బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇదన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కేసీఆర్ భర్తీ చేయలేదు.. నిరుద్యోగ సమస్యను తీర్చలేదన్నారు. రైతుల భూములను మింగేందుకే కేసీఆర్ కామారెడ్డికి వచ్చిండన్నారు.

మన భూములు మన చేతిలో ఉండాలంటే ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను బండకేసి కొట్టాలని పేర్కొన్నారు. కేసీఆర్ కు ఓటు వేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లేనని, కేసీఆర్ కాలనాగులాంటి వారని అన్నారు. కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ వీధి కుక్కలా,  ఆయన కొడుకు ఒక పిచ్చి కుక్కలా మారారని విమర్శించారు.రైతుల భూములను కాపాడేందుకే నేను కామారెడ్డిలో పోటీ చెస్తున్నానని పేర్కొన్నారు. మీ కోసం కొట్లాడుతా... గుంట భూమి గుంజుకోకుండా కంచె వేసి కాపాడుతానని అన్నారు. ఓటుకు పది వేలు ఇచ్చి గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని,కామారెడ్డిలో రూ.200 కోట్లు ఖర్చు పెట్టి రూ.2000 కోట్ల భూములను గుంజుకోవాలని చూస్తుండని అన్నారు. తెలంగాణను దోచుకున్న దొంగ కేసీఆర్ ను ఓడించి బుద్ది చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని అన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు అందిస్తామన్నారు. కేసీఆర్ ఉంటే పెన్షన్ రూ.2వేలేనని, కేసీఆర్ ను బొందపెడితే రూ.4వేలు పెన్షన్,రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తామని అన్నారు. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తామన్నారు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో మాజీమంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్సీ ఆర్కెల నర్సారెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.