ఐపీఎల్ నుంచి ఈ ఐదుగురు స్టార్ ఆటగాళ్లు అవుట్!

ఐపీఎల్ నుంచి ఈ ఐదుగురు స్టార్ ఆటగాళ్లు అవుట్!

ఐపీఎల్  అభిమానులు ఈసారి ఐదుగురు స్టార్ ఆటగాళ్లను మిస్ అవుతున్నారు. శుక్రవారం (ఈ నెల 31న) ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్స్ అయిన గుజరాత్ టైటాన్స్ -నాలుగుసార్లు ట్రోఫీని సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.  అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. గాయాల కారణంగా ఈ ఐపీఎల్‌కు ఐదుగురు స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. వారెవరంటే?

జస్ప్రీత్ బుమ్రా
ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా  ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా చాలా కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లో ఆడతాడని అనుకున్నప్పటికీ వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా విశ్రాంతి కల్పించారు. ఆ తర్వాత ఐపీఎల్‌లో ఆడతాడన్న వార్తలు కూడా వచ్చినప్పటికీ అవి నిజం కాదని తేలిపోయింది.

రిషభ్ పంత్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గతేడాది డిసెంబరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఢిల్లీ నుంచి సొంతూరైన రూర్కీ వస్తుండగా అతడి కారు ప్రమాదానికి గురైంది. ఆపరేషన్ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. దీంతో అతడి స్థానంలో ఢిల్లీ కేపిటల్స్ జట్టు డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.

జానీ బెయిర్‌స్టో
 టీ20 క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటర్లలో బెయిర్‌స్టో  ఒకడు. అతడు కూడా గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. మడమ స్థానభ్రంశం చెందడంతోపాటు, విరిగిన కాలుకు ఆపరేషన్ చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టు అతడి స్థానాన్ని మ్యాట్ షార్ట్‌తో భర్తీ చేసింది.

కైల్ జెమీసన్
 జెమీసన్  కూడా వెన్ను గాయం కారణంగా ఐపీఎల్ 2023కి దూరమయ్యాడు. మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ యమాజన్యం అతడిని కొనుగోలు చేసింది. సర్జరీ కారణంగా నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్‌కు అతడు దూరం కావడంతో దక్షిణాఫ్రికా పేసర్ సిసంద మంగలను సీఎస్‌కే తీసుకుంది.

శ్రేయాస్ అయ్యర్
 ఈసారి ఐపీఎల్‌కు శ్రేయాస్ అయ్యర్  దూరం కావడం కోల్‌కతా నైట్ రైడర్స్‌కు పెద్ద దెబ్బే. అయ్యర్ కూడా వెన్ను నొప్పి కారణంగానే జట్టుకు దూరమయ్యాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం స్టార్ బ్యాటర్ నితీశ్ రాణాను తీసుకోవడమే కాకుండా జట్టుకు అతడిని కెప్టెన్‌గా నియమించింది.