మానుకోట బారాసలో ఇంటి పోరు మరింత తీవ్రం?

మానుకోట బారాసలో ఇంటి పోరు మరింత తీవ్రం?
  • మానుకోట బారాస అభ్యర్థిని మార్చాల్సిందే!
  • త్వరలో ప్రగతి భవన్ కు వెళ్తాం ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యతిరేకవర్గం

కేసముద్రం, ముద్ర: రెండుసార్లు గెలిపించాం, ఉద్యమకారుల సంక్షేమాన్ని గాలికి వదిలేశాడు, మూడోసారి గెలిపించడానికి మాకు మనసు ఒప్పడం లేదు, మానుకోట అసెంబ్లీ బారాస అభ్యర్థిగా శంకర్ నాయక్ ను తప్పించి కొత్త అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ తో ప్రగతి భవన్ కు వెళ్లాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసమ్మతి వర్గం నేతలు నిర్ణయించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామంలో మాజీ సర్పంచ్ సట్ల నర్సయ్య నివాసంలో గురువారం స్టేషన్ సర్పంచ్ బట్టు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన ఉద్యమకారులు, ఎమ్మెల్యే అసమ్మతి వర్గం నేతలు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు పర్యాయాలు అష్ట కష్టాలకోర్చి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను గెలిపిస్తే, ఉద్యమకారులకు, తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఇబ్బందులు పడి కేసుల పాలైన వారి సంక్షేమాన్ని పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆరోపించారు. అనేక పర్యాయాలు ఎమ్మెల్యే చుట్టూ తిరిగినప్పటికీ ఒక్కనాడు కూడా మా గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. ఉద్యమకారులకు ప్రభుత్వ పథకాలు ఏవి అందకుండా చేశాడని ఆరోపించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పార్టీ కోసం కట్టించే కార్యకర్తలకు ఉద్యమకారులకు అండగా నిలిచే విధంగా కొత్త అభ్యర్థిని ప్రకటించాలని, ఇదే అభ్యర్థిని తిరిగి నిలిపితే ఓటమి తప్పదని చెప్పారు.

ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో, అక్రమ దందాలు సాగించే వారితో కోటరిని ఏర్పాటు చేసుకొని, వారు చెప్పిన విధంగానే నడుచుకుంటూ పార్టీ క్యాడర్ను, ఉద్యమకారులను చులకనగా చూస్తున్నారని వాపోయారు. త్వరలో ఈ మేరకు మహబూబాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులతో ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ కు విన్నవిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన భారాస నాయకులు పోలేపల్లి చెన్నారెడ్డి, కాంపాటి మహేందర్, సంకెపల్లి శ్రీనివాస్ రెడ్డి, కమటం స్వామి, కొలిపాక బాబు, చాగంటి రాములు, ఏర్పుల మహేందర్, శీలం విజయ్, వెంకన్న, జల్ల శ్రీను, తుంపిల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.