ఆరుపదుల వయసులోనూ  కుర్రాళ్లతో పోటీపడుతున్న ‘కింగ్‌ కాజు’

ఆరుపదుల వయసులోనూ  కుర్రాళ్లతో పోటీపడుతున్న ‘కింగ్‌ కాజు’

టోక్యో : ఆటకు వయసు అడ్డంకి కాదని నిరూపించాడు ఓ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌. ఆరు పదుల వయసు మీదపడుతున్నా ఆట మీద ఉన్న మక్కువతో తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. మామూలుగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 35 ఏండ్ల వయసులో కెరీర్‌కు వీడ్కోలు పలుకుతుంటారు. కానీ, జపాన్‌ వెటరన్‌ ప్లేయర్‌ కజుయోషి మియుర విషయంలో మాత్రం మరోలా ఉంది. 56 ఏండ్ల వయసులోనూ యువకులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగుతూ.. రిటైర్మెంట్‌ కావడానికి నిరాకరిస్తున్నాడు. ప్రస్తుత ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఎక్కువ వయసు ఉన్న ఏకైక ప్లేయర్‌గా మియుర కొనసాగుతున్నాడు. పోర్చుగల్‌కు చెందిన లిగా2తో కలిసి మరో సీజన్‌కు కాంట్రాక్టు పొందిన మియురాను అందరూ ముద్దుగా ‘కింగ్‌ కాజు’ అని పిలుచుకుంటారు. సరిగ్గా 37 ఏండ్ల క్రితం తన ప్రొఫెషనల్‌ కెరీర్‌ మొదలుపెట్టిన మియుర.. జపాన్‌ తరఫున అత్యధిక కాలం కొనసాగాడు. అంతర్జాతీయ స్థాయిలో జపాన్‌కు 89 మ్యాచ్‌లాడిన ఈ వెటరన్‌ సాకర్‌ ప్లేయర్‌ 55 గోల్స్‌ చేశాడు. 1992లో ఏఎఫ్‌సీ ఆసియా కప్‌ గెలిచిన జపాన్‌ జట్టులో మియుర సభ్యుడు కావడం విశేషం. 23 ఏండ్ల క్రితం జపాన్‌ జాతీయ జట్టు నుంచి వీడ్కోలు తీసుకున్న మియూర.. పోర్చుగల్‌ క్లబ్‌కు సేవలందిస్తున్నాడు.