వర్క్​లోడ్​ భరించాలన్న రోహిత్

వర్క్​లోడ్​ భరించాలన్న రోహిత్

ముంబై: 'జట్టు కోసం ఏ స్థానంలోనైనా ఆడాలి. నేను ఈ స్థానంలో అయితేనే ఆడుతానంటే కుదురదు. జట్టు అవసరాలకు తగ్గట్లు ఏ స్థానంలోనైనా ఆడేందుకు ప్రతీ ఒక్కరు సిద్దంగా ఉండాలి. జట్టులో గాయాల బెడద ఉంది. మిగిలిన ఆటగాళ్లు వర్క్‌లోడ్ భరించాలి. ఇది అంతర్జాతీయ క్రికెట్.. క్లబ్ క్రికెట్ కాదు. ఇప్పటికే జట్టులోని ఆటగాళ్లందరికి ఈ విషయాన్ని తెలియజేశాం.'అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసియాకప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు జట్టు కోసమే రోహిత్ శర్మ తన ఓపెనింగ్ స్లాట్ త్యాగం చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ సమస్యలతో ఆసియాకప్‌ తొలి రెండు మ్యాచ్‌లకు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇషాన్ కిషన్‌కు ఓపెనర్‌గా తప్పితే ఇతర స్థానాల్లో మెరుగ్గా రాణించిన రికార్డు లేదు. అతన్ని ఓపెనర్‌గా ఆడించాలంటే శుభ్‌మన్ గిల్‌ను మిడిలార్డర్‌కు పంపించాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది ఓపెనర్‌గా అతను అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఓ డబుల్ సెంచరీతో పాటు సెంచరీలు బాదాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తన ఓపెనింగ్ స్లాట్‌ను త్యాగం చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా పాకిస్థాన్ లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ షా అఫ్రిది జోరును అడ్డుకునేందుకు ఈ భారీ స్కెచ్ వేసినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే లెఫ్టార్మ్ పేసర్ అయిన యశ్ దయాల్‌తో భారత బ్యాటర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. షాహిన్ షా అఫ్రిది బలం, బలహీనతలను తెలుసుకునేందుకు యశ్ దయాల్‌ను వాడుకున్నారు. లెఫ్టార్మ్ పేసర్ అయిన షాహిన్ షా అఫ్రిది ఆరంభంలో కొత్త బంతితో స్వింగ్ రాబడుతూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. ఈ క్రమంలోనే లెఫ్టార్మ్ బ్యాటర్‌తో అతనికి చెక్‌పెట్టాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లను ఓపెనర్లు‌గా బరిలోకి దించాలనుకుంటోంది. ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ ఆడనుండగా.. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో రోహిత్ శర్మతో బ్యాటింగ్ చేయించాలని ప్రణాళికలు రచిస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తరహాలో రోహిత్ శర్మ ఫినిషర్ పాత్ర పోషించే అవకాశం ఉంది. మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో టీమిండియా కాంబినేషన్ గురించి మాట్లాడుతూ.. రోహిత్ మిడిలార్డర్‌లో ఆడే అవకాశం ఉందన్నాడు. 'చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాటలను అర్థం చేసుకుంటే రోహిత్ శర్మ మిడిలార్డర్‌లో ఆడే అవకాశం ఉంది. కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తే రోహిత్ నాలుగు, ఐదో స్థానంలో బరిలోకి దిగవచ్చు.'అని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.