భారత్​– పాక్​మ్యాచ్​పై కరుణించని వరుణుడు

భారత్​– పాక్​మ్యాచ్​పై కరుణించని వరుణుడు
  • జోరు వర్షంతో ఆగిపోయిన మ్యాచ్​

కొలంబో: భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌కు మరోమారు వరుణుడు ఆటంకం కల్పించాడు. మంచి జోరు మీద మ్యాచ్ జరుగుతుండగా భారీ వర్షం స్టేడియాన్ని తడిపేసింది. చిన్న తుప్పరగా మొదలైన వర్షం క్షణాల్లోనే భారీ వానగా మారింది. దీంతో గ్రౌండ్ స్టాఫ్ వేగంగా మైదానం మొత్తాన్ని కవర్స్‌తో కప్పేశారు. వాళ్లకు పాక్ ప్లయర్ ఫకర్ జమాన్ సాయం చేశాడు కూడా. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సడెన్‌గా వర్షం మొదలవడం, అంతలోనే కుంభవృష్టిగా మారడంతో ప్రేమదాస స్టేడియం గ్రౌండ్ స్టాఫ్ వేగంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అయితే వాళ్లు చాలా వేగంగా మైదానాన్ని కవర్స్‌తో కప్పేశారు. ఒకవేళ ఈ రోజు ఇక మ్యాచ్ జరగలేదంటే.. సోమవారం రిజర్వ్ డే నాడు మిగతా మ్యాచ్ జరుగుతుంది. అంటే భారత ఇన్నింగ్స్ ఇప్పుడు ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే రిజర్వ్ డేలో మొదలవుతుంది. ఒకవేళ సోమవారం కూడా వరుణుడు కరుణించకుంటే ఇక చేసేదేం లేదు. తుది నిర్ణయాన్ని తీసుకోనుంది.

అదే కనుక 20 ఓవర్ల మ్యాచ్ జరిగే వీలుండి, పాకిస్తాన్ ఛేజ్ చేయాల్సి వస్తే.. 20 ఓవర్లలో ఆ జట్టు 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. వర్షం పడుతోంది కాబట్టి ఇక్కడి నుంచి బౌలర్లకు బంతిపై గ్రిప్ దొరకడం కష్టంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ తర్వాత బ్యాటింగ్ చేసే జట్టుకు ఇది కలిసొచ్చే అంశమే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర ఆజమ్.. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత టీం కూడా వర్షం పడే అవకాశం ఉన్నందునే.. ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. రోహిత్ శర్మ (56), శుభ్‌మన్ గిల్ (58) ఇద్దరూ అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. అయితే వీళ్లిద్దరూ వరుస ఓవర్లో అవుటవడంతో భారత్‌పై కొంత ఒత్తిడి పడింది. ఇలాంటి సమయంలో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడే భారీ వర్షం ఈ మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది.