ఉత్కంఠ విజయంతో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా

ఉత్కంఠ విజయంతో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా

19న టీమిండియాతో తలపడనున్న కంగారులు 
కోల్‌కతా :కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికా, -ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ ఉత్కంఠగా సాగింది. కానీ, స్కోర్ బోర్డ్‌పై చాలా తక్కువ స్కోర్ ఉండడంతో సౌతాఫ్రికా చివరి వరకు పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. 213 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో విజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు 8వ సారి ఫైనల్‌కు చేరుకుంది. వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్రికా జట్టు సెమీఫైనల్‌లో ఓడిపోవడం ఇది ఐదోసారి.

గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ అత్యధికంగా 101 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ తలో 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 213 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 12 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఆస్ట్రేలియా విజయంతో నవంబర్ 19న జరిగే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది.