రామగుండం మేయర్ కు అవిశ్వాస గండం తప్పదా......

రామగుండం మేయర్ కు అవిశ్వాస గండం తప్పదా......
  • క్యాంపుకు సిద్ధమైన కార్పొరేటర్లు...
  • పారని మాజీమంత్రి, మాజీ ఎమ్మెల్యే పాచికలు
  • అవసరమైతే పార్టీ మారేందుకు నిర్ణయించుకున్న కార్పొరేటర్లు


ముద్ర పెద్దపల్లి, ప్రతినిధి:- రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ కు అవిశ్వాస గండం తప్పేటట్టు లేదు. ఈ మేరకు మెజారిటీ కార్పోరేటర్లు  ఒక తాటిపైకి వచ్చి  మేయర్ పై అవిశ్వాసం పెట్టడానికే నిశ్చయించుకున్నట్లు సమాచారం. సోమవారం నాడు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ను కలిసి అవిశ్వాస తీర్మానం అందజేసి అట్నుంచి అటే క్యాంపునకు వెళ్లేందుకు  అంతా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా  మేయర్ పై సొంత పార్టీ కార్పోరేటర్లు అవిశ్వాసం పెట్టి ఆయనను గద్దె దించి... అదే పార్టీ నుంచి 28 వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపురి పులేందర్ కు పగ్గాలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు కూడ తెలిసింది. కాగా, మొదటినుంచి రామగుండం మేయర్ అనిల్ కుమార్ పై అసంతృప్తితో నెట్టుకొస్తున్న కార్పొరేటర్లు  ఇక ఓపిక నశించి ఈ విషయంలో ఎవరి మాట వినకుండా అవిశ్వాసం పెట్టాలని తుది నిర్ణయం కు వచ్చినట్లు తెలుస్తోంది. కాదు కూడదని పార్టీ అధిష్టానం ఆపాలని చూస్తే, అవసరమైతే బిజెపి పార్టీలోకి వెళ్లేందుకు కూడా వెనుకాడబోమని ఆ పార్టీ కార్పొరేటర్లు బాహటంగానే సవాల్ విసురుతున్నారు.

మొదటినుంచి అభివృద్ధి పనుల విషయంలో కార్పొరేటర్లకు మేయర్ ఎలాంటి సహాయ సహకారాలు కూడా అందించలేదని స్థానికంగా విమర్శలు ఉన్నాయి. అభివృద్ధి పనుల విషయంలో కూడా మేయర్ మార్కు ఎక్కడ కనిపించలేదు. గత నెల రోజుల క్రితమే మేయర్ పై అవిశ్వాసం ప్రయోగించి గద్దె దించాలని  సొంత పార్టీ కార్పొరేటర్లు  సమావేశమై నిర్ణయానికి రాగా.. పలు దఫాలుగా  మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే  కోరు కంటి చందర్ లు కార్పొరేటర్ లను బుజ్జగిస్తూ వచ్చారు. బీఆర్ ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి విరుద్ధంగా అవిశ్వాసం పెట్టొద్దని చెప్పడంతో కార్పోరేటర్లు యూటర్న్ తీసుకున్నారు. అయితే మిగతా ప్రాంతాలలో అవిశ్వాసం ప్రక్రియలు జరుగుతుండగా, ఇక్కడ మాత్రం ఎందుకు పెట్టొద్దని ఆలోచన చేసిన కార్పొరేటర్లు ఆ దిశగా స్థానిక మాజీ ఎమ్మెల్యే కు కూడా  అవిశ్వాసం పెడతామని తెగేసి చెప్పినట్లు తెలిసింది. ఈ విషయంలో అడ్డు చెప్పాలని చూస్తే పార్టీ మారేందుకు కూడా వెనకాడ మని చెప్పినట్లు తెలిసింది. ఏది ఏమైనా  రామగుండంలో కూడా క్యాంపు రాజకీయాలు మొదలు కావడంతో ఆసక్తికరమైన వాతావరణ నెలకొంది. మేయర్ ను  గద్దె దించుతారా...? క్యాంపు కు బ్రేక్ పడుతుందా? అనేది వాడివేడి చర్చ జరుగుతుంది.