మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

మత విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
  • కాంగ్రెస్ షాడో నేత కేసిఆర్
  • కర్ణాటకలో బిజెపి ఓటుబ్యాంక్ తగ్గలే
  • తెలంగాణలో బిజెపి దే అధికారం
  • కర్ణాటక రాజకీయాలు తెలంగాణలో చెల్లవు


ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :బజరంగ్ దళ్ ను నిషేధిస్తామంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం స్థానిక ఎంపీ కార్యాలయంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడారు.
కర్ణాటకలో బిజెపి ఓడిన ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని అన్నారు. గతంలో మాదిరిగానే 36% ఓట్లు వచ్చాయని సీట్లు మాత్రమే తగ్గాయని వెల్లడించారు. కాంగ్రెస్, జెడిఎస్, టిఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేశాయని ఆరోపించారు. ఓ వర్గం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కు పడేలా కుట్ర చేశారన్నారు. ఎంఐఎం ఎంఐఎం పార్టీతోపాటు నిషేధిత పిఎఫ్ఐ సంస్థకు చెందిన ఎన్డిపిఐ పార్టీ సైతం కాంగ్రెస్ గెలుపుకు కృషి చేశాయని చెప్పారు. కర్ణాటక రాజకీయాలు తెలంగాణ లో చెల్లవన్నారు. ఇక్కడ కాంగ్రెస్ గల్లంతవడం ఖాయం అన్నారు.
తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో  హుజూరాబాద్, మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు గల్లంతయ్యాయని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపేనని చెప్పారు. కాంగ్రెస్ కు కెసిఆర్ షాడో మిత్రుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసే పోటీ చేస్తాయని చెప్పారు. కర్నాట‌క‌లో కాంగ్రెస్ కు మద్దతిచ్చి కేసీఆర్ అక్కడ పెద్దన్న పాత్ర పోషించారని అరోపించారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్రం అప్పుల పాలు అయిందని, కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు నాయకులు రాపర్తి ప్రసాద్, దూబాల శ్రీనివాస్, అజయ్ వర్మ తో పాటు తదితరులు పాల్గొన్నారు.