ప్రతి కార్మికుడికి ఆరోగ్య పరీక్షలు

ప్రతి కార్మికుడికి ఆరోగ్య పరీక్షలు

15 వేలు విలువచేసే 140 పరీక్షలు ఉచితం

ముందస్తు వ్యాధి నిర్ధారణే లక్ష్యం

వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యానికి సిఫారసు

కరీంనగర్ లో అధునాతన ల్యాబ్ ఏర్పాటు

రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలోని ప్రతి కార్మికుడు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్నదే తెలంగాణ ప్రభుత్వ  ధ్యేయమని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
బుధవారం పట్టణంలోని జ్యోతి నగర్ లో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో ఉచిత పరీక్షల ల్యాబ్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలను నిర్వహిస్తుందన్నారు. ముంబాయి సి ఎస్ సి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో మొత్తం 19 రకాల్లో 140 పరీక్షలను ఉచితంగా చేస్తుందన్నారు. కార్మికుల్లో ఉన్న వ్యాధిని నిర్ధారించడం ప్రభుత్వ ప్రధమ కర్తవ్యం అని, వ్యాధిని ముందుగా గుర్తిస్తే చికిత్స సులువుతుందన్నారు. భవన నిర్మాణ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి కార్మికుడికి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 ల్యాబ్ లను ప్రారంభించడం జరిగిందన్నారు. కరీంనగర్ ల్యాబ్ లో కరీంనగర్ జిల్లాతో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన కార్మికులకు ఈ ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే లక్ష మంది కార్మికులను గుర్తించడం జరిగిందని, ఇప్పటివరకు నమోదు చేసుకోని  వారు త్వరగా ఎన్రోల్ చేసుకోవాలని సూచించారు. ఎన్రోల్ మెంట్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి కార్మికుడి పేరుతో హెల్త్ ప్రొఫైల్ రెడీ చేస్తామన్నారు. ప్రతిరోజు సుమారు 3500 శాంపుల్స్ ని సేకరించి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయినా వారికి అవసరమైతే అధునాతనమైన వైద్య చికిత్సను అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.