బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి

బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి
  • ఈనెల 20న హైకోర్టులో విచారణకు రానున్న కేసు
  • బండి తరపున న్యాయవాది కరుణాసాగర్ వివరణ

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేసిన గంగుల కమలాకర్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారనే అంశంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్ కు సంబంధించి శుక్రవారం క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. హైకోర్టుకు విచ్చేసిన బండి సంజయ్ కుమార్ ను గంగుల కమలాకర్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. వారడిగిన ప్రశ్నలన్నింటికీ బండి సంజయ్ వివరణ ఇచ్చారు. క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో మళ్లీ ఈనెల 20న హైకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. గత ఎన్నికల్లో గంగుల కమలాకర్ ఎన్నికల అఫిడవిట్ లో తనకున్న ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలు చూపలేదని, ఎన్నికల ఖర్చును తక్కువగా చూపారని, ప్రచార ఖర్చు వివరాలు పూర్తిస్థాయిలో వెల్లడించకుండా తప్పు దోవ పట్టించారని పేర్కొంటూ బండి సంజయ్ గతంలో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. అందులో భాగంగా శుక్రవారం క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగిసింది.

మరోవైపు క్రాస్ ఎగ్జామినేషన్ కు గైర్హాజరైనందున హైకోర్టు బండి సంజయ్ కు రూ.50వేల జరిమానా విధించిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. బండి సంజయ్ తరపు న్యాయవాది కరుణాసాగర్ ఈ వార్తలను కొట్టిపారేశారు. బండి సంజయ్ కు హైకోర్టు జరిమానా విధించలేదని స్పష్టం చేశారు. ‘‘పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నందున ఒకసారి, అమెరికా పర్యటనలో ఉన్నందున మరోసారి బండి సంజయ్ హాజరు కాలేకపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో క్రాస్ ఎగ్జామినేషన్ కు సమయం అడిగినందున కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం సైనిక్ వెల్ఫేర్ ఫండ్ కు రూ.50 వేలు జమ చేశామే తప్ప అది జరిమానా కాదు.’’ అని వివరణ ఇచ్చారు.