అందరినీ కాపాడుకుంటాం..

అందరినీ కాపాడుకుంటాం..
  • పార్టీ నిర్ణయమే అంతిమం
  • అంతా కలిసి కట్టుగా ఉండాలి
  • జనగామ అంటే కరువు కేరాఫ్‌ ఉండే.. 
  • కేసీఆర్‌‌ హయాంలోనే ఈ ప్రాంతం సస్యశామలమైంది
  • తెలంగాణ వచ్చాకే భూముల రేట్లు పెరిగినయ్‌
  • పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

ముద్ర ప్రతినిధి, జనగామ : ‘జనగామపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ ఉంటుంది. ఈ ప్రాతం అన్నా.. ఇక్కడి లీడర్లన్నా.. ఆయనకు ఎంతో ఇష్టం.. ఎన్నికలు వస్తున్నయ్‌.. ఎవరో ఒకరు పిచ్చి రాజకీయాలు చేస్తుంటరు.. వాటిని ఎవరూ నమ్మొద్దు.. ఇక్కడి నాయకులందరినీ కాపాడుకుంటాం..’ అని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీని సీఎం కేసీఆర్‌ శుక్రవారం వర్చవల్‌గా ప్రారంభించి ఆయన సందేశం ఇచ్చారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షత వహించగా.. మంత్రి దయాకర్‌రావుతో పాటు జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఒకప్పుడు జనగామ అంటే కరవుకు కేరాఫ్‌గా ఉండే.. ఇక్కడి జనం పనుల కోసం వేరే ప్రాంతాలకు వలస పోతుండే వారు.. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌‌ ప్రభుత్వం జనగామ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. జనగామ అభివృద్ధిపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్‌ ముర్ఖులు మళ్లీ మన ఇండ్లకు వస్తున్నారని, దొంగ హామీలు ఇస్తున్నారని విమర్శించారు. నింజగా చేతనైతే ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వారు చెప్పే హామీలను అమలు చేయాలని సవాల్‌ విసిరారు. ఎవరు ఎన్ని జిక్కులు చేసినా రాష్ట్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీయే అని దయాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. 

క‌లిసి క‌ట్టుగా ప‌ని చేయాలి..
బీఆర్‌ఎస్‌లో ఉన్న వాళ్ల అంతా తెలంగాణ కోసం ఉద్యమించిన వాళ్లే..! తెలంగాణ ఉద్యమంలో, పున‌ర్ నిర్మాణంలో పాలు పంచుకున్న వాళ్లే.. పార్టీకి ఎవ‌రూ త‌క్కువ కాదు.. ఎక్కువ కాదు అంతా స‌మాన‌మే.. ఎవ‌రి సేవ‌లు ఎలా తీసుకోవాలి.. ఎవ‌రిని, ఎప్పుడు, ఏ విధంగా గుర్తించాలన్నది సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు..’ అని మంత్రి ఎర్లబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. సభ ప్రారంభం కాగానే ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ తాటికొండ రాజ‌య్య, ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వారి అనుచ‌రులు స‌భ‌లో హంగామా చేశారు. నినాదాలు ఇచ్చారు. కేరింత‌లు కొట్టారు. బ‌ల నిరూప‌ణ త‌ర‌హాలో ప్రవ‌ర్తించారు. దీంతో ఎర్రబెల్లి తాను మాట్లాడే స‌మ‌యంలో వారికి గ‌ట్టి స‌మాధానం చెప్పారు. పార్టీ నిర్ణయమే అంతిమం అని ఎంత‌టి వారైనా దానికి క‌ట్టుబ‌డి ఉండాలని సూచించారు.