ప్రజా‘వాణి’ వినుడుతోనే సరి..!

ప్రజా‘వాణి’ వినుడుతోనే సరి..!
  • పేరుకుపోతున్న గ్రీవెన్స్‌ అర్జీలు
  • ఏళ్ల తరబడి తిరుగుతున్న బాధితులు
  • పట్టించుకోని అధికారులు
  • రెవ్యెన్యూ సమస్యలే ఎక్కువ

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి మొక్కుబడిగా సాగుతోంది. అర్జీదారులు ఎన్నో వ్యయప్రయాసల కోసం కలెక్టరేట్‌కు వస్తే వారి సమస్య పరిష్కారం కావడం లేదు. రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి తిరుగుతున్న బాధితులు తమ చెప్పులు అరుగుతున్నాయి తప్ప సమస్యలు మాత్రం తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మొత్తం 50 దరఖాస్తులు రాగా ఇందులో  రెవెన్యూ శాఖ 31, డీఆర్‌‌డీవో 12, డీఎస్‌వో 2, జడ్పీ సీఈవో  ఒకటి, డీపీవోకు సంబంధించి 4 అప్లికేషన్లు ఉన్నట్టు కలెక్టరేట్‌ అధికారులు వెల్లడించారు.

అయితే ప్రతి వారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ కు భూము సమస్యల ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయి. అర్జీదారులు తమ సమస్య పరిష్కారం కాక నెలలో రెండు మూడు సార్లు రావడమే ఎక్కువగా కనిస్తోంది. ఈ వారం వచ్చిన వారిలో చాలా మంది పాత వారే ఉన్నారు. ఇక కలెక్టర్‌‌ శివలింగయ్య అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, రోహిత్ సింగ్‌తో కలిసి ఎప్పటిలాగే వినతులు స్వీకరించారు. అనంతరం వాటిని పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖ అధికారులకు కలెక్టర్‌‌ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌‌ ఆర్డీవోలు మురళీకృష్ణ, సుహాసిని, డీఆర్డీవో పీడీ రామిరెడ్డి, జడ్పీసీవో వసంత, డీపీవో రంగాచారి, సీపీవో ఇస్మాయిల్, జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఏకే మన్సురి, ఏతేశాం అలీ పాల్గొన్నారు. 

20 ఏళ్లు తిరుగుతుండు..

ఈ ఫొటో ఉన్నది జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూరుకు చెందిన రెడ్డబోయిన బలరాం. ఈయన బతుకుదెరువు కోసం కొన్ని ఏళ్లపాటు ఊరు విడిచి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన మండలానికి చెందిన కొందరు బలరాం 4 ఎకరాల భూమిని కబ్జా చేశారు. దీని కోసం బలరాం దాదాపు 20 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నాడు. నెలలో ప్రతీ గ్రీవెన్స్‌ కు వచ్చి ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారింది. కానీ అధికారులు ఇంతవరకు బలరాం సమస్య పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టలేదు.

కోర్టుకు పొమ్మంటున్నరు...

జనగామ మండలం పసరమడ్లకు చెందిన నిర్మాల నర్సింగరావు, రేవతి దంపతులకు వాసత్వంగా ఉన్న భూమి వేరే వారిపై పట్టాయ్యింది. వీఆర్వో క్రాంతికుమార్‌‌ కావాలనే తమ భూమిని వేరే వారి పట్టా చేశారని కొన్ని నెలలుగా ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని చాలా సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో గత ఫిబ్రవరిలో కలెక్టరేట్‌ భవనం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అప్పడు సమస్య పరిష్కారిస్తామని చెప్పినా ఆఫీసర్లు ఆ తర్వాత పట్టించుకోలేదు. ఐదు నెలలుగా వారు కలెక్టరేట్‌ చుట్టు తిరుగుతూనే ఉన్నారు. వీఆర్వో తప్పిదం వల్లే పట్టా జరిగిందని చెబుతున్న ఆఫీసర్లు దానిని కరెక్ట్‌ చేయకుండా తమను కోర్టుకు వెళ్లమని సలహా ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్‌ అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే సోమవారం ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నర్సింగరావు దంపతులు కలెక్టరేట్‌ నుంచి బయటకు వెళ్లే వరకు ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ వారినే పరిశీలిస్తూ ఉండడం గమనార్హం.