రాష్ట్రంలో నియంత పాలన

రాష్ట్రంలో నియంత పాలన
  • సీఎం కేసీఆర్‌‌.. ఓ 420
  • తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత ఆయనదే..
  •  వైఎస్సార్‌‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ:  నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని ఓ నియంతలా పాలిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని వైఎస్సార్‌‌ టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి ఆరోపించారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశానికి జిల్లా అధ్యక్షుడు గౌరబోయిన సమ్మయ్య అధ్యక్షత వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివంగత నేత వైఎస్సార్‌‌ సీఎంగా ఉన్నప్పుడు మాట ఇచ్చారంటే తప్పేవారు కాదని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న సీఎం కేసీఆర్‌‌ ఇచ్చిన హామీలను మరిచి.. ఓ 420లా మారాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పడం తప్ప చేసిందేమిలేదని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశాడని ఆరోపించారు.

రాష్ట్రంలో లక్షా 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. వైఎస్సార్‌‌ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్‌ షర్మిల దీక్షతో కొన్ని పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ పేపర్‌‌ లీకులతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందన్నారు. కేసీఆర్‌‌ సర్కారు నిరుద్యోగల జీవితాలతో ఆటలాడుకుంటుందని మండిపడ్డారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే ఈనెల 17న అఖిలపక్షం ఆధ్వర్యంలో షర్మిల దీక్ష నిర్వహించనుందని వెల్లడించారు. ఈ దీక్షకు పార్టీలకతీతంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. 

భారీగా చేరికలు...
వైఎస్సార్‌‌ టీపీ సర్వసభ్య సమావేశంలో జనగామ నియోజకవర్గ కోఆర్డినేటర్‌‌ ఇందుర్తి వెంకట్‌రెడ్డి పెద్ద మొత్తంలో పార్టీలో చేరారు. పట్టణంలోని వీవర్స్ కాలనీకి చెందిన దాదాపు 160 మంది పార్టీలో చేరగా రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది శ్రీహరి, జిల్లా యూత్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, మహిళా అధ్యక్షురాలు మంజుల, ఐటీ వింగ్‌ అధ్యక్షుడు మేడ ప్రశాంత్‌, లీడర్ల వంశీ, భద్రయ్య, నరేశ్‌, శ్రీకాంత్‌, గుగ్గిళ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.