ఆర్థిక గొడవలతోనే హత్య

ఆర్థిక గొడవలతోనే హత్య
  • మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
  • వివరాలు వెల్లడించిన ఏసీపీ దేవేందర్‌‌రెడ్డి

 ముద్ర ప్రతినిధి, జనగామ : పట్టణంలో ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు జనగామ ఏసీపీ కె.దేవేందర్‌‌రెడ్డి తెలిపారు. మంగళవారం జనగామ పోలీస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలు వెల్లడించారు. జనగామకు చెందిన మాలోతు విజయ (38) కు నర్మెట మండలం బొమ్మకూరుకు చెందిన మాలోతు తిరుపతితో కొన్నేళ్ల కింద పెళ్లయ్యింది. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో ఆమె విడిపోయి జనగామలోని గుండ్లగడ్డలో పిల్లలతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఫంక్షన్‌ హాల్స్‌ లో క్యాటరింగ్‌ పనులు చేసే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొమ్మపల్లి మాలోతు మోహన్‌ రావుతో ఆమెకు పరిచయం ఏర్పడి అది సహజీవనానికి దారితీసింది.

మోహన్‌రావు హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో పని చేస్తూ విజయ ఇంటికి వస్తుండే వాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా నడిచేవి. వారం కింద డబ్బుల విషయంలో మోహన్‌రావు, విజయ మధ్య గొడవ జరగడంతో అతడు ఆమె విడిచి వెళ్లిపోయాడు. ఈనెల 25న మళ్లీ జనగామలోని విజయ ఇంటికి వచ్చి గొడవపడి రోకలి బండతో బలంగా కొట్టడంతో తల పగిలి చనిపోయింది. మృతురాలి కొడుకు మాలోతు వెంకట్‌ నాయక్‌ ఫిర్యాదు మేరకు కేసు ఫైల్‌ చేసినట్టు డీసీపీ వివరించారు. అయితే మంగళవారం పట్టణంలో సంచరిస్తున్న నిందితుడు మోహన్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీనివాస్‌ యాదవ్‌, ఎస్సై సృజన్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.