అటకెక్కిన అవిశ్వాస తీర్మానం

అటకెక్కిన అవిశ్వాస తీర్మానం
  • మొక్కులు తీర్చుకున్న చైర్మన్ దంపతులు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి డాక్టర్ రాజేష్ రెడ్డి గెలుపొందడంతో మునిసిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని పలు ఊహాగానాలు వెలుపడ్డాయి. ఎన్నికల సమయంలోనే పలువురు బిఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన కౌన్సిలర్లు కూడా రాజేష్ రెడ్డికి అండగా నిలవడంతో పాటు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఇరువురు కూడా అధికార పార్టీకి చెందినవారు కావడంతో సునాయాసంగా అవిశ్వాస తీర్మానం నెగ్గుతారని వినిపించింది. మరోవైపు బి ఆర్ ఎస్ పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అదే పార్టీలోనే మరొకరికి అవకాశం కల్పించే విధంగా చర్చించుకుని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఎన్నిక అనంతరం చైర్మన్ అయిన వాళ్ళు కలవాలని సూచించినట్లు తెలిసింది.

ఏది ఏమైనా నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ఖాయమనే గుసగుసలు రసవత్తరమైన చర్చ సాగిన సందర్భంలో అవిశ్వాస తీర్మానం ఇప్పట్లో ప్రవేశపెట్టే అంశాన్ని వాయిదా వేసుకోవాలని నేతలు ఆదేశించడంతో అవిశ్వాస తీర్మానం అటికెక్కినట్లేనని చర్చ వినపడుతుంది ఈ సందర్భంలోనే ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్గా కొనసాగుతున్న కల్పనా భాస్కర్ గౌడ్ దంపతులు ఆదివారం ఆయన వార్డులోని పలువురుని నాయినోని పల్లి మైసమ్మ ఆలయానికి తీసుకువెళ్లి మొక్కులు తీర్చుకోవడంతోపాటు చుక్క ముక్క ఏర్పాటు చేసినట్లు సమాచారం ఈ దావత్ పై మున్సిపాలిటీలో జోరుగా చర్చ సాగుతుంది.