మణిపూర్‌లో మళ్లీ మొదలైన హింస

మణిపూర్‌లో మళ్లీ మొదలైన హింస

ఇంఫాల్​: మణిపూర్‌లో మే 3న ప్రారంభమైన హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం ఉదయం బిష్ణుపూర్‌ సమీపంలోని మొయిరంగ్‌లో రెండు వర్గాల మధ్య తుపాకులతో ఘర్షణ జరిగింది. కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. ఈ గ్రామంలో చాలా ఇళ్లను తగులబెట్టారని తెలిపారు. ఈ గ్రామంలో చాలా ఇళ్లను తగులబెట్టారని తెలిపారు. ఘర్షణ జరిగిన చోటుకు సమీపంలోని గ్రామస్థులు హుటాహుటిన వేరొక చోటుకు పరుగులు తీసి, ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. స్థానికులు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, బుధవారం రాత్రి నుంచి ఈ గ్రామంలో హింసాత్మక ఘర్షణలు ప్రారంభమయ్యాయని, తుపాకులతో కాల్పులు జరుగుతున్నాయని తెలిపారు. తాము రాత్రంతా నిద్రపోలేదని, ఏమీ తినలేదని తెలిపారు. ఎడతెగకుండా కాల్పుల శబ్దాలు వినిపిస్తుండటంతో తాము తీవ్ర భయాందోళనలకు గురయ్యామని చెప్పారు. మెయిటీ తెగవారిని షెడ్యూల్డు తెగల కేటగిరీలో చేర్చడంపై పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మణిపూర్ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మే 3 నుంచి మెయిటీలు, కుకీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ హింసాత్మక సంఘటనల్లో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని 10 శాతం భూభాగంలో మెయిటీలు ఉంటారు, కుకీలు, నాగాలు ఎస్టీ వర్గంలోకి వస్తారు. వీరు రాష్ట్రంలోని దాదాపు 90 శాతం భూభాగంలో ఉంటారు. మెయిటీలు రాష్ట్ర జనాభాలో 53 శాతం కాగా, కుకీలు, నాగాలు కలిపి 40 శాతం వరకు ఉంటారు.