Liquor Scam సిసోడియా అరెస్ట్​

Liquor Scam సిసోడియా అరెస్ట్​
Manish Sisodia Arrested after CBI Question
  • నేతలు, కార్యకర్తల హంగామా
  • ఇరుపార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు

న్యూఢిల్లీ : ‘ఢిల్లీ లిక్కర్​స్కామ్​’లో సిబిఐ ఉప ముఖ్యమంత్రి మనిష్​సిసోడియా’ను ఆదివారం అరెస్టు చేసింది. ఆదివారం విచారణకు హాజరు కావాలని నోటిసులిచ్చిన అధికారులు ఎనిమిది గంటల విచారణ అనంతరం సిసోడియాను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. సీబీఐ కార్యాలయానికి వెళ్లేముందు ఆయన తన అనుచరులతో అరెస్టు విషయాన్ని ముందే చెప్పారు. తాను జైలులో ఉంటే కూడా మీరు అధైర్యపడొద్దన్నారు. మీ పోరాటాన్ని కొనసాగించాలన్నారు. సీబీఐ కార్యాలయానికి వెళ్లేముందు తన తల్లి దీవెనలు తీసుకొని,  మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. కాగా సిసోడియా ఇంటివద్ద భారీ ఎత్తున ఆప్​ నాయకులు, కార్యకర్తలు గుమిగూడడంతో పోలీసులకు తలకుమించిన భారంలా పరిణమించింది.

మరోవైపు సిబిఐ కార్యాలయం ముందు కూడా ఆప్​ కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో చేరుకోవడం సిబిఐకి తలనొప్పిగా మారింది. మాట వినని వారిపై బీజేపీ నేతలు ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని, బుల్డోజర్లతో వారి ఇళ్లను కూల్చేస్తున్నారని బీజేపీ ద్వంద్వ నీతికి ఇది నిదర్శనమని ఆప్​నేతలు ఆరోపించారు. సిసోడియాను విచారించే ముందు ప్రధాని మోడీని విచారించాల్సి ఉంటుందని, అదానీతో ఆయన అంటకాగిన వీడియోలు, ఫోటోలు బహిరంగంగా కనిపిస్తుంటే ఆ విచారణలు మానేసి సిబిఐ ఏకపక్షంగా వ్యహరించడం వారి చేతకాని తనానికి నిదర్శనమన్నారు.

లిక్కర్​ స్కామ్​లో ప్రభుత్వాదాయానికి వేలకోట్ల రూపాయలు గండి కొట్టడం వల్లే వారిని సిబిఐ విచారిస్తోందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కల్పించుకోదని, అవినీతిపరులు ఎక్కడున్నా, ఈడీలు, ఐటీలు వాటి పని అవి చేసుకుపోతుంటాయని అవినీతికి పాల్పడిన వారికి ఈ సంస్థలంటే భయం ఉండాలే గానీ, ఏమీ చేయని వారికి ఎందుకని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికే పలు ఆధారాలతో సహా ఆప్​నేతలు లిక్కర్​స్కామ్​లో బయటికి రాలేని విధంగా ఇరుక్కున్నారని, దేశవ్యాప్తంగా ఈ లిక్కర్​స్కామ్​కు లింకులు ఉన్నాయని అందరినీ బయటకు లాగుతామని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. లిక్కర్​ స్కామ్​ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేరు కూడా చోటు చేసుకోవడంతో ఇక్కడ బీఆర్​ఎస్​ వర్గాల్లోనూ టెన్సన్​ పెరిగింది.