సిమెంట్​ లారీని ఢీకొన్న సుమో

సిమెంట్​ లారీని ఢీకొన్న సుమో
  • 13మంది మృతి

బెంగుళూరు:  కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ వద్ద ఆగి ఉన్న సిమెంట్ లారీని వెనుక నుంచి టాటా సుమో ఢీకొట్టడంతో 13 మంది మృతిచెందారు. బాధితులంతా ఏపీకి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం గురువారం ఉదయం చోటు చేసుకుంది. దసరా పండుగ కోసం స్వస్థలాలకు వచ్చిన వీరంతా తిరిగి బెంగళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. చిక్​బళ్లాపూర్​ బాగేపల్లి సమీపంలో జాతీయ రహదారి వద్ద సిమెంట్​ మిక్సర్​ లారీ ఆగి ఉండగా టాటా సుమో అతివేగంతో ఢీకొనడంతో వీరంతా మృతిచెందినట్లు తెలిపారు. సుమోలో మొత్తం 18 మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనకు మరో కారణం పొగమంచు కూడా అయి ఉండవచ్చునని అనుమానాలను అధికారులు వ్యక్తం చేశారు. మృతులను కూలీలుగా గుర్తించారు. వీరంతా ఏపీలోని సత్యాసాయి జిల్లా గోరండ్ల మండలానికి చెందినవారన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్​ సాయంతో టాటా సుమోను వెనక్కి లాగారు. ఘటనా స్థలంలోనే ఏడుగురు మృతిచెందగా మిగతా ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారన్నారు. వాహనం మిక్సర్​ లారీలో ఇరుక్కుపోవడంతో దాన్ని లాగేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. క్రేన్​తోపాటు, కట్టర్​ తదితరాలను వాడి అతికష్టమ్మీద ప్రమాదానికి గురైన వారిని బయటికి తీయగలిగారు. ప్రమాదం ఏపీ సరిహద్దుకు 40 కి.మీ. దూరంలో జరిగింది.