రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు..

రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు..

భూపాలపల్లిలో ఈవిఎం లను  చెకింగ్ చేసిన ఇంజనీర్లు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:  రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఈవిఎం యంత్రాలను సోమవారం ఈసీఐఎల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో తనిఖీ చేసినట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. ఈ నెల 12 నుండి 22 వరకు ఈ తనిఖీలు ఉంటాయని అయిన తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ  భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూన్ 12 నుండి పది రోజుల పాటు ఈవీఎం యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ నలుగురు  ఈసిఐఎల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో  జరుగుతుందని తెలిపారు. భూపాలపల్లి జిల్లాకు వచ్చిన 574 బ్యాలెట్ యూనిట్లు, 448 కంట్రోల్ యూనిట్లు, 483 వివి ప్యాడ్లతో పాటు, యంత్రాల పనితీరు పరిశీలించడం జరుగుతుందని, ఈవిఎం చెకింగ్ పై మూడు రోజుల క్రితం అన్ని రాజకీయ పక్షాలకు సమాచారం అందించామని తెలిపారు. 

పది రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 9గం. నుండి సాయంత్రం 7గం. వరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా ఈవిఎం యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ నిర్వహించడం జరుగుతుందని, ఈవీఎం యంత్రాలపై ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఈ ప్రక్రియ జరుగుతుందని వివరించారు.

ఈవీఎం ఫస్ట్ లెవెల్ చెకింగ్ ముగిసిన తర్వాత వెయ్యి ఓట్లతో మాక్ పోలింగ్ నిర్వహిస్తామని, అప్పుడు కంట్రోల్ యూనిట్ లో వచ్చిన ఓటు వివరాలు వివి ప్యాడ్ స్లిప్పుల వివరాలను చెక్ చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ ఇక్బాల్, ఎలక్షన్ సిబ్బంది, సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీలు ప్రతినిధులు పాల్గొన్నారు.