తెలంగాణ ఉద్యమకారుడిని ఆదుకోండి

 -కుడికాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్న మల్లారెడ్డి. 
- పెన్షన్,ట్రై సైకిల్ లేక ఇబ్బంది పడుతున్నాడు. 

 ముద్ర,రాయికల్ : రాయికల్ పట్టణం నుంచి తెలంగాణ ఉద్యమంలో 2001 నుండి చురుకుగా పాల్గొని,జైలు భరో,తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా సార్లు అరెస్ట్ అయ్యాడు. కాగా అతనిపై ఎఫ్.ఐ ఆర్ నెంబర్ లు 130/2012,79/2013 నమోదు అయ్యాయి. అలాగే తెలంగాణ ధూమ్ ధాం,రాస్తారోకోలు, ధర్నాలు,ర్యాలీలలో వందలాది మంది యువతను వెంట బెట్టుకొని ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లిన రాయికల్ పట్టణానికి చెందిన తీగుళ్ల మల్లారెడ్డి 68 సంవత్సరాల వయసు గల అతనిది ఇటీవల ఇన్ఫెక్షన్ కారణంగా కుడికాలు తీసివేశారు.


దాదాపు నాలుగు నుండి ఐదు లక్షల వరకు ఆపరేషన్కు ఖర్చు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటి నుండి ఇప్పటివరకు ప్రభుత్వపరంగా ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు.68 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ పెన్షన్ కూడా రావడంలేదని, దురదృష్టవశాత్తు తన కుడికాలు పోవడం వల్ల ఇప్పుడు మంచానికే అంకితమయ్యాడని,అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాడని,ఇప్పటి వరకు రిలీఫ్ ఫండ్ రాలేదని స్థానికులు తెలిపారు. జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,కలెక్టర్ యాస్మిన్ భాషా స్పందించి, ట్రై సైకిల్ తో పాటు, సీఎం రిలీఫ్ ఫండ్,వికలాంగుల పెన్షన్ ఇప్పించాలని స్థానికులు కోరారు.