ఇంటి పోరులో.. ‘ఇనుగాల’

ఇంటి పోరులో.. ‘ఇనుగాల’

పరకాల, ముద్ర:  పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరికి అవకాశం వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో పరకాల టికెట్ కోసం చివరి వరకు పోటీపడి టికెట్ రాకపోవడంతో  ఇనుగాల వెంకట్రామిరెడ్డి తీవ్ర నైరాశంలోనికి వెళ్లారు. ఈ ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గంలో  తీవ్రమైన సంక్షోభానికి గురైంది. ‘రెంటికి చెడ్డ రేవడిలా’ నియోజకవర్గంలోని కార్యకర్తలు,నాయకులు మారారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిట్టిపోశాయి. 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన కొండా దంపతులు పరకాలను విస్మరించడంతో పార్టీ క్యాడర్ మొత్తం చెల్లా చెదురైంది. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రెండు సంవత్సరాలుగా పార్టీ చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం ఇనుగాల వెంకట్రామిరెడ్డి ముందుకొచ్చారు. పార్టీ అభివృద్ధి కోసం పరకాల నియోజకవర్గంలో  అప్పుడప్పుడు కార్యకర్తలతో మాట్లాడడం , చిన్న చిన్న కార్యక్రమాలను విజయవంతం చేశారు. వెంకట్రామిరెడ్డి ఇక్కడ ఉన్న కొద్దిపాటి క్యాడర్​ను కాపాడుకునే పనిలో ఆయన నిమగ్నమయ్యారు.

ఎన్నికల వేళ పార్టీ పెద్దల అండదండలతో కొంత మంది టికెట్ పొంది బరిలో నిలవడం జరుగుతోందని ఆయన వాపోతున్నారు. ఈ క్రమంలో ఇంటిపోరు ఎదుర్కొంటూనే  వెంకటరామిరెడ్డి తన ప్రయత్నాల్లో వేగం పెంచారు. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలన్న రీతిలో పార్టీ పెద్దల దగ్గర మద్దతును పొందే ప్రయత్నాలను మొదలు పెట్టారు.ఈక్రమంలోనే పార్టీలోని క్యాడర్ లో జోష్ ను నింపడానికి  వారం రోజుల క్రితం ఆత్మకూరు మండలంలోని అక్కెంపేట వేదికగా కొండా మురళి, ఇనుగాల వెంకట్రామిరెడ్డి  పోటాపోటీగా సమావేశాలు నిర్వహించి బలబలాలని నిరూపించుకున్నారు. అక్కడ ఇరువర్గాల కార్యకర్తల ఘర్షణ పూరిత వాతావరణం ఉండటం వలన సమావేశం ఏర్పాటు చేయకుండానే వెనుతిరిగిన వెళ్లిపోయారు. ఈ పరిస్థితిలో  ఇనుగాలకు ఇంటిపోరు వల్ల టికెట్ వస్తుందా రాదా అన్న అయోమయంలో ఆయన అభిమానులు ఉన్నారు. ఇనుగాలకు టికెట్ కేటాయించినట్లయితే, గెలిపించుకొని వస్తామన్న రీతిలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా కొంతమంది నాయకులు అనుకుంటున్నారు. ఇనుగాల తన ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలో ఎన్నో సేవ కార్యక్రమాలతో పార్టీ శ్రేణులను కాపాడే చర్యలు చేపట్టారని నాయకులు అంటున్నారు.ఈ పరిస్థితిలో ఇనుగాలకు కాకుండా మరొకరికి ఎవరికైనా పరకాల కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తే రానున్న రోజుల్లో పార్టీ  తీవ్రంగా నష్టపోయే పరిస్థితిలో  ఉంటుందని రాజకీయ పండితులు అంటున్నారు.