జనావాసాల్లోకి అటవీ జంతువులు..

జనావాసాల్లోకి అటవీ జంతువులు..
  • భయం గుప్పిట జనం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని పలు సరిహద్దు మండలాలు, గ్రామాల్లోకి పులులు, చిరుతలు ప్రవేశిస్తుండడంతో ప్రజలు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నారు. గతంలో కుబీర్, కుంటాల, తానూరు మండలాల్లో పులి సంచారం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. తాజాగా నిర్మల్ పట్టణం మీదుగా వెళుతున్న 44 జాతీయ రహదారి వైపు నుంచి బంగల్ పేట్ వైపు వెళ్లే రోడ్డులో ప్రతిరోజు చిరుత కనిపించడం సాధారణమైపోయింది. ఇదిలా ఉంటే  రెండు రోజులుగా సారంగాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో చిరుత పులి సంచారాన్ని గుర్తించారు.

బుధవారం రాత్రి  దూడను చంపి తినేయడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అడవుల్లో ఉండే క్రూర జంతువులు జనావాసాల్లోకి రావడం పట్ల జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై పులి జాడలను కనుగొన్నప్పటికీ, వీటి రాకను నియంత్రించాల్సిన చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారే తప్ప శాఖా పరంగా చేపట్టాల్సిన చర్యలపై ఎవరు నోరు మెదపడం లేదు. తిరుమలలో పులుల సంచారాన్ని గుర్తించిన అధికారులు వాటిని పట్టుకునే యత్నాలు చేసి సఫలం అయ్యారు. జిల్లాలోని అటవీ అధికారులు మాత్రం వీటిని పట్టే దిశగా కానీ, వీటి రాకను అరికట్టే చర్యలు కానీ చేపట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు రెండు రోజులపాటు హడావుడి చేయడం, తర్వాత నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం పరిపాటి అయిపోయింది. ఇప్పటికైనా అటవీ శాఖ మంత్రి ఇలాకాలో క్రూర జంతువుల తాకిడిని నివారించే దిశగా చర్యలు చేపట్టాల్సి ఉంది.