నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రభుత్వ లక్ష్యం - దేవాదాయ శాఖ మంత్రి అల్లోల

నాణ్యమైన విద్యుత్ సరఫరా ప్రభుత్వ లక్ష్యం - దేవాదాయ శాఖ మంత్రి అల్లోల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రైతులు, ప్రజానీకం నాణ్యమైన విద్యుత్ పొందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.  నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం రాంసింగ్ తండాలో రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించబోయే 33/11 కే వి విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు ఆయన సోమవారం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్మల్ నియోజక వర్గంలో ఇప్పటివరకు 58 సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. గతంలో ప్రతిరోజూ విద్యుత్ సరఫరాలో అంతరాయాల తో పాటు లో ఓల్టేజ్ సమస్యను ప్రజలు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రస్తుతం ఈ సమస్యను అధిగమించామని అన్నారు. నిర్మల్ లో రూ. 2కోట్ల వ్యయంతో బంజారా భవన్ నిర్మాణ పనులకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డి సి సి బి చైర్మన్ రాంకిషన్ రెడ్డి, జెడ్ పీ టీ సి రాజేశ్వర్ రెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు వెంకట్ రాంరెడ్డి, పారిశ్రామిక వేత్త మురళీధర్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు నారాయణ రెడ్డి, మాణిక్ రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ ఆయిటి చందు, తదితరులు పాల్గొన్నారు