హస్తవ్యూహం..!

హస్తవ్యూహం..!
  • ఎన్నికల షెడ్యూల్​ విడుదలతో తుది దశకు టిక్కెట్ల కేటాయింపు
  • అసంతృప్తులకు చెక్​ పెట్టేలా కాంగ్రెస్​ వ్యూహం
  • వివాదస్పద స్ధానాలు.. కామ్రెడ్లకు
  • బీసీలకు 25 టిక్కెట్లకు గ్రీన్​ సిగ్నల్
  • కమ్మ వర్గంతో కుదరని ఏకాభిప్రాయం
  • హస్త వ్యూహంపై అసంతృప్త నేతలు గుర్రు 
  • అభ్యర్థుల ప్రకటనకు మరింత జాప్యం

ముద్ర, తెలంగాణ బ్యూరో :  కాంగ్రెస్​ ను కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపులో జరుగుతోన్న జాప్యం.. పొత్తుల విషయంలో కాంగ్రెస్​ తీసుకుంటోన్న నిర్ణయాలు రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపుపై ప్రతికూల ప్రభావం చూపేలా ఉన్నాయి. కులాల ప్రాతిపదికగా టిక్కెట్లలో ప్రాధాన్యం కల్పించాలంటూ కాంగ్రెస్​ నేతల్లో రోజు రోజుకు పెరుగుతోన్న డిమాండ్​.. అసంతృప్తికి దారితీస్తున్న నేపథ్యంలో ఆ సమస్య నుండి ఎలా గట్టెక్కాలో అనే అంశంపై ఏఐసీసీ మేథోమథనం చేస్తోంది. దరఖాస్తులు స్వీకరించిన పక్షం రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటించాలని ముందుగా భావించిన ఏఐసీసీకి కుల టిక్కెట్ల డిమాండ్​ కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. దీంతో టీపీసీసీ సీనియర్లతో ఇప్పటికే అనేక మార్లు భేటీ అయిన ఏఐసీసీ అధినేతలు టిక్కెట్ల కేటాయింపుపై చర్చలు జరిపారు. ముందుగా 30 మందితో తొలి జాబితా ప్రకటించాలని భావించిన ఏఐసీసీ తర్వాత 60 మంది, 70 మందితో కూడిన జాబితాను సిద్దం చేసినట్లు ప్రచారం జరిగింది.  పార్టీలో నెలకొన్న డిమాండ్​ తో ఇక నేరుగా 119 సెగ్మెంట్లకు అభ్యర్ధులను ఖరారు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. తాజాగా ఈ నెలా మూడో వారంలో ప్రారంభంకానున్న బస్సుయాత్ర తర్వాతే అభ్యర్థులను ప్రకటించాలని ఏఐసీసీ భావిస్తోంది. 

తేలని లెక్క..!

ఇప్పటికే బీసీలు డిమాండ్​ చేస్తున్న 34 సీట్ల కేటాయింపుపై ఎటూ తేల్చని కాంగ్రెస్​.. సీపీఐకు కొత్తగూడెం, మునుగోడు, సీపీఎంకు మిర్యాలగూడ, భద్రాచలం సీట్లు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంపై సీనియర్లలో అసంతృప్తి భగ్గుమంటోంది. భద్రాచలం మినహా తాము ఆశించిన మూడు స్ధానాలు కమ్యూనిస్టులకు కేటాయించి.. టిక్కెట్లు మళ్లీ అగ్రవర్గాలకే అంటగట్టే ప్రయత్నం చేస్తుందంటూ బీసీ నేతలు గుర్రుగా ఉన్నారు. మరోవైపు బీసీ సీనియర్లతో అనేక మార్లు చర్చలు జరిపిన ఏఐసీసీ.. వారికి 25 స్ధానాలు కేటాయిస్తున్నట్లు సంకేతాలిచ్చింది. దీంతో పాటు పార్లమెంట్​ ఎన్నికల్లో 5 ఎంపీ టిక్కెట్లు, మరో ఏడుగురు బీసీలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. అధికారిక ప్రకటన రాకపోవడంతో ప్రస్తుతం బీసీ నేతలు సైతం సెలెంట్​ గా ఉన్నారు. తమ వర్గానికి ఏ ఏ సీట్లు కేటాయిస్తుందోననే ఉత్కంఠ బీసీ నేతల్లో నెలకొన్నది.

పోటీకీ చెక్​

టిక్కెట్ల కోసం కొనసాగుతోన్న ఒత్తిడి, నెలకొన్న అసంతృప్తికి చెక్​ పెట్టేలా కాంగ్రెస్​ పొత్తు ఆయుధాన్ని వాడింది. సీనియర్లు డిమాండ్​ చేస్తున్న స్ధానాలను కమ్యూనిస్టులకు కేటాయించడం ద్వారా అసంతృప్తిని కాస్త తగ్గించేల వ్యూహాన్ని రచించింది. ముఖ్యంగా కాంగ్రెస్​ ఓబీసీ చైర్మన్​ ఎడవెల్లి కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్ రావు, టీపీసీసీ సభ్యుడు నాగా సీతారాములు గత కొన్నేళ్లుగా కొత్తగూడెం నుండి పోటీకి సిద్ధమయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్​ నుండి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు కారెక్కినా.. తాము మాత్రం కాంగ్రెస్ ​నే నమ్ముకుని పార్టీ బలోపేతానికి కృషి చేశారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు తమకే వస్తుందనే ధీమాతో భారీగా ఖర్చు చేసి పార్టీ సభ్యత్వాలు చేయించారు. 

ఈ క్రమంలో ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం ఇరువురూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే రెండు నెలల క్రితమే కాంగ్రెస్​ లో చేరిన ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం నుండి పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు.. వైఎస్సార్టీపీని కాంగ్రెస్​ లో విలీనం చేసుకుని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిలను పాలేరు నుండి బరిలో దింపాలని నిర్ణయించిన ఏఐసీసీ.. పొంగులేటీకి ఖమ్మం, కొత్తగూడెం టిక్కెట్టు ఇవ్వాలని భావించింది. కానీ షర్మిల చేరికను సీనియర్లు అడ్డుకోవడం, ఆమెను కాంగ్రెస్​ లో చేర్చుకుంటే పార్టీ గెలుపుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలుండడంతో షర్మిల చేరికను దాటవేసిన ఏఐసీసీ పొంగులేటిని పాలేరు, తుమ్మలను ఖమ్మం నుండి బరిలో దింపాలని నిర్ణయం తీసుకుంది. ఇటు కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి తన కుమారుడు రఘువీర్​ రెడ్డికి మిర్యాలగూడ, జైవీర్​ రెడ్డికి నాగార్జున సాగర్​ టిక్కెట్టు డిమాండ్​ చేస్తుండడంతో కుటుంబంలో ఎవరికో ఒకరికి సీటు ఇవ్వాలని నిర్ణయించిన ఏఐసీసీ జానారెడ్డి సొంత నియోజకవర్గమైన నాగార్జున సాగర్​ ను జైవీర్​ రెడ్డికి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా నాగార్జున సాగర్​ సీటును సీపీఎంకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇటు మరో వివాదస్పద సెగ్మెంట్​ అయిన మునుగోడు నుండి పాల్వాయి గోవర్ధన్​ రెడ్డి కుమార్తె స్రవంతి, తెలంగాణ ఉద్యమ నేత కైలాస్​ నేత, టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ముఖ్య అనుచరుడు.. సామాజిక కార్యకర్త చలమల్ల కృష్ణారెడ్డి పోటీ పడుతున్నారు.  


ఇక్కడ ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా మిగిలిన అభ్యర్థులు వ్యతిరేకంగా పని చేసే అవకాశాలుండడంతో ఆ సమస్యను గట్టెక్కించేందుకు ఆ స్ధానాన్ని సీపీఎంకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. పినపాక నుండి పోటీకి సిద్ధమైన బలమైన సామాజిక వర్గనేత పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య తనయకుడు సంతోష్ లతో పాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క తనయుడు సూర్యం సైతం పోటీకి సై అంటున్నారు. దీంతో ఈ ముగ్గురిని కాదని భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను పినపాక నుండి బరిలో దించాలని భావిస్తున్న ఏఐసీసీ.. భద్రాచలం స్ధానాన్ని సీపీఎంకు కేటాయించాలని నిర్ణయించింది. మరోవైపు.. 12 టిక్కెట్లు డిమాండ్​ చేస్తున్న కమ్మ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని భావిస్తున్నప్పటికీ వారు కోరుతోన్న స్ధానాల్లో.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పద్మావతి రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, అజారుద్దీన్​ వంటి బలమైన కాంగ్రెస్​ అభ్యర్థులు ఎమ్మెల్యే రేసులో ఉండడంతో కమ్మ వర్గ నేతలను బుజ్జగించే పనిలో ఏఐసీసీ పడింది. ఇటు  పది స్థానాల్లో గెలుపును నిర్ణయించే స్ధాయిలో ఉన్న తమకు కనీసం ఐదు టిక్కెట్లు కేటాయించాలంటూ గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్,  మానుకోల సురేష్ మంగళవారం టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. 

గెలిచే నాయకులకే టిక్కెట్లు
అభ్యర్థుల ప్రకటనపై పుకార్లొద్దు
టీపీసీసీ చీఫ్ రేవంత్​ రెడ్డి

ఉత్కంఠ రేపుతోన్న కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్​ రెడ్డి స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకే టిక్కెట్లు వరిస్తాయని స్పష్టం చేశారు. అభ్యర్థులను ప్రకటించి బస్సు యాత్రకు వెళ్లాలా.. లేక బస్సు యాత్ర మధ్యలో అభ్యర్థులను ప్రకటించాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ నాయకత్వం సూచన మేరకు బస్సు యాత్రపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మంగళవారం గాంధీభవన్​ లో పార్టీ వ్యవహారాల కమిటీ సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీపీఐ, సీపీఎం పార్టీలతో పొత్తుల అంశం ఇంకా చర్చల స్థాయిలోనే ఉన్నాయని చెప్పారు. సీట్ల విషయంలో సమర్థులైన నాయకులను సంప్రదించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు.

కాంగ్రెస్​ నేతల హోదాలు, గౌరవం తగ్గకుండా సమన్వయం చేసేందుకు కేసీ వేణుగోపాల్ కమిటీని నియమించారని.. ఎలాంటి సమస్యలు ఉన్నా కమిటీ సభ్యులు ఇంచార్జ్ ఠాక్రే, దీపాదాస్ మున్షి,మీనాక్షి నటరాజన్,జానారెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కమిటీ సభ్యులందరూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారన్నారు. ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్నా.. కొంత మంది అధికారులు నిబంధనలు ఉల్లంఘించి నిధులు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు.. పెన్షన్ తప్ప మిగతా వాటికి ఎలాంటి నిధులు విడుదల చేయొద్దని కోరారు. చట్టంలో లొసుగులు వాడుకుంటోన్న అధికార బీఆర్​ఎస్​ వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీఆర్​ఎస్ కు కొమ్ముకాసే పోలీస్,ఐఏఎస్,రెవెన్యూ, పలు విభాగాల అధికారుల వివరాలను కాంగ్రెస్ సేకరిస్తోందని చెప్పారు. నియమ నిబంధనలు ఉల్లంఘించి బీఆర్​ఎస్​కు ప్రయోజనం చేకూర్చే అధికారులందరిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకోసం తాము ప్రత్యేక కమిటీని నియమించామని.. కమిటీ ఇచ్చే వివరాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాజకీయ పార్టీల సొంత మీడియా కాంగ్రెస్ పై అపోహలు సృష్టిస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన ఆరు నెలల ముందు వేసిన అన్ని టెండర్లపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా జరిపిన భూముల అమ్మకాల లెక్క తేలుస్తామన్నారు.  ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ థాక్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,ఏఐసీసీ కార్యదర్శులు , ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జనారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్,మహేష్ కుమార్ గౌడ్ , వి.హనుమంతరావు, కేంద్రమాజీ మంత్రులు  రేణుకచౌదరి, బలరాం నాయక్, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డి,చిన్నారెడ్డి,సంపత్ కుమార్ పాల్గొన్నారు.