మాట తప్పని మోడీ.. అబద్దాల కోరు కేసీఆర్

మాట తప్పని మోడీ.. అబద్దాల కోరు కేసీఆర్
  • ఎవరు కావాలో నిర్ణయించండి
  • ముథోల్ సభలో ఈటల రాజేందర్ 

ముద్ర ప్రతినిధి, నిర్మల్/బాసర: ఈ అసెంబ్లీ ఎన్నికలు మాట తప్పని మోడీ పార్టీకి, అబద్ధాల కోరు కేసీఆర్ కు మధ్య జరిగే సమరమని, ఎవరు కావాలో నిర్ణయించుకోవాలని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోరారు. ఈ ఎన్నికల్లో  అబద్దాల కేసీఆర్ ను సాగనంపడం ఖాయమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో కేసీఆర్  మాట చెల్లుబాటు కావటం లేదన్నారు. 2014 లో ముఖ్య మంత్రి అయ్యాక తెలంగాణ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకపోగా అహంకారంతో ‘నేనే రాజు నేనే చక్రవర్తి’ అని విర్ర వీగుతున్నారన్నారు. ఇలా విర్రవీగిన నియంతలు ఏమయ్యారో అందరికీ తెలుసన్నారు.

డబుల్ బెడ్ రూమ్ పథకం అధికార పార్టీ నేతలకు డబ్బుల పథకంగా మారిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. గ్రామ గ్రామాన వంద మందికి ఒక బెల్ట్ దుకాణం పెట్టారని విమర్శించారు. జ్వరం వస్తే ఆసుపత్రిలో మందు లేదుకానీ,  తాగేవాళ్లకు మందుకు కొరత లేదని ఎత్తి పొడిచారు. భాజపా అభ్యర్థులను గెలిపిస్తే నాలుగో తేదీ నుండి వరికి రూ.3100 మద్దతు ధర కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల ఆరోగ్య బీమా అందిస్తామని హామీ ఇచ్చారు. జ్ఞానప్రదాత సరస్వతీ మాత కొలువైన బాసరను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజల  ఆశీస్సులు మోడీ వెంటే ఉన్నాయన్నారు. ఓట్లకోసం ప్రత్యర్థులు ఇచ్చే పైసలు తీసుకోండి, అవి మన పైసలే, ఓటు మాత్రం రామారావు పటేల్ కి వేయండని కోరారు.