కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారీ వ్యవస్థ!

 కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారీ వ్యవస్థ!
  • పైరవీ కారులతో నష్టపోయేది రైతులే!
  • సంక్షేమ పథకాలు వద్దన్నోళ్లకు ఓట్లేయ్యద్దు 
  •  సింగరేణిని ముంచింది కాంగ్రెస్సే!
  • బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి..
  • ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు

 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ దళారీ వ్యవస్థ ఎదురవుతుంది..  పైరవీకారులతో రైతులు నష్టపోవాల్సి వస్తుంది..  సంక్షేమ పథకాలు వద్దన్నోళ్లకు ఓట్లు వేయొద్దు.. సింగరేణిని కాంగ్రెస్ పార్టీ ముంచింది.. బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమృద్ధిగా జరిగింది.. ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించండి.. రానున్న రోజుల్లో జిల్లాలను, నియోజకవర్గాలను మరింత అభివృద్ధి చేస్తాం.. అంటూ సీఎం కేసీఆర్ జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా కేంద్రాల్లో శుక్రవారం జరిగిన ప్రజా ఆశీర్వాదం బహిరంగ సభల్లో ప్రసంగించారు. 

 ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి, ములుగు నియోజకవర్గ కేంద్రాల్లో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే అభ్యర్థులు గండ్ర వెంకటరమణారెడ్డి, బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలకు సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆలోచనలకు అనుగుణంగా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. అభ్యర్థులను చూడాలని సూచించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే బీఆర్ఎస్ పుట్టిందన్నారు. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి అనేక మంచి కార్యక్రమాలు చేసుకోవడం జరిగిందని చెప్పారు. పేదల సంక్షేమం కోసం పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు వంటి కార్యక్రమాలతోపాటు అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు అమలు చేయడంతో పాటు ఉన్న పథకాలను మెరుగు పరచుకోవడం జరుగుతుందన్నారు. సింగరేణిని కాంగ్రెస్ పార్టీ నిలువునా ముంచిందని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లకు చేతకాక కేంద్ర ప్రభుత్వం వద్ద తెచ్చిన అప్పులు కట్టలేక సింగరేణిలో 49శాతం వాటాను కట్టబెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ చేతకానితనం వల్ల మొత్తం సింగరేణి వ్యవస్థ అస్తమైందన్నారు.

ఈ విషయం సింగరేణి కార్మిక నేతలు రాజిరెడ్డి, వెంకట్రావు నాకు చెబితే కాపాడుకోవడం జరిగిందన్నారు. సింగరేణి చరిత్రలో వెయ్యి కోట్ల రూపాయలు కార్మికులకు పంచడం జరిగిందని, బోనస్ గాని, లాభాల వాటా గాని 32శాతం వాటా ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ములుగులో ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన బడే నాగజ్యోతిని ఆదరించి గెలిపించాలని, నాగజ్యోతి గెలిస్తే ములుగులో వెలుగులు నిండుతాయని అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందని సీఎం చెప్పారు. అదేవిధంగా భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డిని గెలిపిస్తే ఈ జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం గతంలో సిరికొండ మధుసూదనాచారి, ఇప్పుడు గండ్ర వెంకటరమణారెడ్డి తనకు చెబుతూ నిధులు మంజూరు చేయించుకుంటారని, రానున్న రోజుల్లో భూపాలపల్లిని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వర్షంలోనూ పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం చూస్తుంటే బడే నాగజ్యోతి, గండ్ర వెంకటరమణారెడ్డి   తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తారని అనిపిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు 80 నియోజకవర్గాలు తిరిగి సభల్లో ప్రసంగించినట్లు తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందుతున్నారని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీది ఏమి లేదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తుస్సుమనడం ఖాయమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వేరువేరుగా జరిగిన ఈ సమావేశాల్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, ఎంపీ పసునూరి దయాకర్, గోవిందు నాయక్, సాంబారి సమ్మారావు, ఎమ్మెల్యే అభ్యర్థులు బడే నాగజ్యోతి, గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్మన్లు గండ్ర జ్యోతి, జక్కు శ్రీహర్షిని, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్​గౌడ్, టీబీజీకేఎస్ నాయకులు వెంకట్రావు, ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


కాంగ్రెస్​ వస్తే ధరణి ఎత్తివేస్తారటా
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి : సీఎం కేసీఆర్ శుక్రవారం  గోదావరిఖని జవహర్ నగర్ లో గల సింగరేణి స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి కార్మికుల కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇన్​కామ్​టాక్స్ రద్దు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ధరణితో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆ ధరణి  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎత్తివేస్తామని అంటున్నారన్నారు. ధరణి ఎత్తివేస్తే రైతుల మీ భూమికు రక్షణ ఉండదని కేసీఆర్ హెచ్చరించారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో రైతులకు భూమిపై పూర్తి హక్కు ఉందన్నారు. ముఖ్యమంత్రి కూడా భూమిని మార్పిడి చేసే అధికారం లేదని అదే ధరణి గొప్పతనం అని కేసిఆర్ వివరించారు.  కాంగ్రెస్ పార్టీ దారితప్పి అధికారంలోకి వస్తే రైతుల బతుకులు ఆగమవుతాయన్నారు.  ధరణి పోతే దళారులు వచ్చి రైతులను పీక్క తింటారన్నారు. దయచేసి ఓటు వేసేటప్పుడు రైతులు, మేధావులు, యువకులు ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేసి  రామగుండం అభ్యర్థిచందర్ ను రామగుండం ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించాలని కేసీఆర్ కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ  బోర్లకుంట వెంకటేశ్​నేతకాని, మాజీ స్పీకర్ మధుసూధనాచారి,  టీబీజీకేఎస్ నయకులు మిర్యాల రాజిరెడ్డి కెంగర్ల మల్లయ్య,  రామగుండం చైర్మన్ బంగి అనిల్ కుమార్, నాయకులు కౌశిక్ హరి,  బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.   
===