ఊరిలో గ్రంథాలయం నిర్మించాలనేది నా కల..

ఊరిలో గ్రంథాలయం నిర్మించాలనేది నా కల..
  • ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీగేయ రచయిత చంద్రబోస్..
  • చల్లగరిగలో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:ఆస్కార్ అవార్డు రావడంతోనే తమ ఊరిలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణం చేపట్టాలని భావించానని ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన కనుకుంట్ల చంద్రబోస్ కు త్రిబుల్ ఆర్ సినిమాలో రాసిన 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. కాగా స్వగ్రామంలో ఇటీవలే పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు అందరూ కలిసి చంద్రబోస్ ను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ తమ ఊరిలో ఉన్న గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరిందని తన సొంత నిధులతో నూతన భవనం నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న చంద్రబోస్ చల్లగరిగలోని శివాలయం పక్కన గల గ్రంథాలయ పాత భవనాన్ని నేలమట్టం చేయించారు.

ఈ మేరకు శుక్రవారం చల్లగరిగ గ్రామానికి చేరుకుని, గ్రామ ప్రముఖుల సమక్షంలో గ్రంధాలయ నూతన భవన నిర్మాణానికి చంద్రబోస్ చేతులమీదుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను ఈ స్థాయికి ఎదగడానికి కారణం మా ఇంటి పక్కన గల గ్రంధాలయమేనని అన్నారు. చదువుకునే రోజుల్లో శివాలయంలో జరిగే భజన పాటలు వింటూ, గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న బాల సాహిత్యం తదితర పుస్తకాలను చదవడం వల్లనే తనకు పాటలు రాయడం అలవాటుగా మారిందని ఆ పాటలతోనే సినీ పరిశ్రమలో అవకాశం లభించింది అన్నారు. తాజ్ మహల్ సినిమాలో మొట్టమొదటిసారిగా మంచు కొండల్లోన చంద్రమా అనే పాటతో తనకు అవకాశం లభించగా, ఆ పాటతో తనకు మరిన్ని అవకాశాలు రావడం జరిగిందని తెలియజేశారు. సినీ పరిశ్రమలో అనేక పాటలు రాసినప్పటికీ, అవార్డులు అందుకున్నప్పటికీ, ఆస్కార్ అవార్డు రావడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. అందుకే తన వంతు సహకారంగా పుట్టిన ఊరిలో సొంత నిధులతో గ్రంథాలయ భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఈ మేరకు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చంద్ర బోస్ సతీమణి సుచిత్ర, ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, ఉప సర్పంచ్ సంఘ గౌతమి అశోక్, రిటైర్డ్ ఉపాధ్యాయులు బండి రాజమౌళి, కనుకుంట్ల నరసయ్య, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.