తలపునే గోదావరి ఉన్నా జిల్లాకు చుక్క నీరు రావట్లే..

తలపునే గోదావరి ఉన్నా జిల్లాకు చుక్క నీరు రావట్లే..
  • మా ప్రాంత ప్రజల డిమాండ్లను మంత్రి పరిష్కరించాలి..
  • ములుగు ఎమ్మెల్యే సీతక్క..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: తలాపునే గోదావరి ఉన్నా, ములుగు జిల్లాకు చుక్క నీరు రావడంలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ రేపు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ములుగు పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజల సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలిని అన్నారు. ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు అందించేందుకు కృషి చేయాలని, రామప్ప నుండి లక్నవరం వరకు కెనాల్ మంజూరు అయి భూ సేకరణ పూర్తి అయినప్పటికీ, పనులు ప్రారంభించలేదని, గోదావరిలో ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసి పెద్ద చెరువులు నింపి, ఈ ప్రాంతానికి సంపూర్ణంగా గోదావరి జలాలు  అందించే విధంగా  ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ములుగు మండలం కాసీందేవిపేట నుండి సర్వాపూర్ వరకు ఎస్ఆర్ఎస్పీ కాలువలను పునరుద్ధరించి సాగు నీరు అందించాలని, గడిచిన తొమ్మిదిన్నరేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇగ ఇస్తాం, అగ ఇస్తాం అని చెప్పడం తప్ప ఒక్కరికీ పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవని, అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆక రాధాకృష్ణ, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నల్లెల భరత్
కుమార్, మాజీ సహకార సంఘం చైర్మన్ కునురీ అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.