జీపీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి..

జీపీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి..
  • జీఓ నంబర్ 51ని సవరించి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి..
  • ప్రమాదవశాత్తు చనిపోయిన సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల సాయం చేయాలి..
  • జీపీ సిబ్బంది సమ్మెలో గండ్ర సత్యనారాయణ రావు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి, జీఓ నంబర్ 51ని సవరించాలని టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నుండి గ్రామపంచాయతీ సిబ్బందిని రెగ్యలర్ చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. ఇందులో భాగంగా భూపాలపల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు గురువారం జీపీ సిబ్బంది సమ్మె ప్రారంభం కాగా,  గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. 

ఈ సందర్భంగా సత్యనారాయణ రావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి, ప్రమాదవశాత్తు చనిపోయిన సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.10లక్షల సాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, కారోబార్, బిల్ కలెక్టర్ లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని అన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించి, జిపీ సిబ్బంది నాయకులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్ల ను  పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి రూరల్, పట్టణ అధ్యక్షులు సుంకరి రామచంద్రయ్య, ఇస్లావత్ దేవన్, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, నాయకులు రామినేని రవీందర్, అంబాల శ్రీనివాస్, నగునూరి రజినీకాంత్, తోట రంజిత్, బెంబడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.