వనపర్తి కాంగ్రెస్ లో  కలకలం

వనపర్తి కాంగ్రెస్ లో  కలకలం
  • పార్టీ సభ్యత్వానికి నలుగురు కౌన్సిలర్ల రాజీనామా
  • ఎమ్మెల్యే అభ్యర్థిగా చిన్నారెడ్డి తప్పుకోవాలని డిమాండ్

ముద్ర ప్రతినిధి,  వనపర్తి : వనపర్తి మునిసిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన ఐదుగురు కౌన్సిలర్లలో నలుగురు కౌన్సిలర్లు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్లో కలవరం మొదలైంది. శనివారం వనపర్తి లోని కాంగ్రెస్ నాయకులు సతీష్ నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రకటించారు. రాజీనామా చేసిన వారిలో పదో వార్డు కౌన్సిలర్ జయసుధ మధు గౌడ్ 31 వ వార్డు కౌన్సిలర్ బండారు రాధాకృష్ణ 21వ వార్డు కౌన్సిలర్ బాపనపల్లి వెంకటేష్ 14 వ వార్డు కౌన్సిలర్ బ్రహ్మయ్య చార్యులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్, పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ జి చిన్నారెడ్డి తప్పుకోవాలని, ఆయన అంటే మాకు అపార గౌరవం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు డబ్బుతో ముడిపడి ఉన్నందున ఆయన పోటీ చేస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని వారు అన్నారు. చిన్నారెడ్డి ఇప్పటికే చాలాసార్లు పోటీ చేశారని, నాయకులు కార్యకర్తలు ప్రజలు విసుగు చెందారని, కొత్త అభ్యర్థిని నిలబెడితే గెలుపు కోసం తాము సాయి శక్తుల కృషి చేస్తామని వారన్నారు. పదవులు గుత్తాధిపత్యం కాదని, వారసత్వం అంతకన్నా కాదని వారు అన్నారు. దశాబ్దాలుగా పార్టీకి పనిచేస్తూ ఉన్న నాయకులకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని, ఈ విషయమై రాష్ట్ర కామ కేంద్ర పార్టీ నేతల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని వారు తెలిపారు. అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.