మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

ముద్ర, జమ్మికుంట:-బిజెపి మతోన్మాద,కార్పోరేట్ విధానాలకు వ్యతిరేకంగా, సంక్షేమం, మతసామరస్యం ప్రజాస్వామ్యం,రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి అండతో ఆదాని, అంబానీలు దేశ ప్రజల ధనాన్ని లూటీ చేస్తున్నారన్నారు.15 లక్షల కోట్ల ప్రజా సంపద ఆవిరైపోయిన ఎంత మాత్రం పట్టించుకోని ప్రభుత్వం, సామాన్యులపై అధిక బారాలు మోపుతూ పేదల నడ్డి విరుస్తుందన్నారు.ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని గద్దె ఎక్కాక ఉన్న ఉద్యోగాలు పీకేసారన్నారు.ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొడుతున్నారన్నారు.44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోళ్లుగా తీసుకొచ్చి కార్మిక హక్కులను హరించి వేస్తున్నారన్నారు.అత్యంత ప్రమాదకరమైనటువంటి విద్యుత్ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తుందన్నారు.మోడీ విధానాల మూలంగా ప్రతి ఏటా 12600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కనీస మద్దతు  ధరల చట్టం చేయాలని, ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, రైతాంగం కోరుతున్న కేంద్రం పట్టించుకోవడంలేదని ఎద్దేవా చేశారు.

దళిత గిరిజన మహిళ మైనార్టీ బీసీలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని రాజ్యాంగ యంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు.ప్రజాస్వామ్య హక్కులను కూడా హరించేందుకు కేంద్ర ప్రభుత్వం పునుకుంటుందన్నారు.బిజెపి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసిన మీడియాపై ప్రజాస్వామ్యవాదులపై తీవ్రమైన దాడులకు తెగబడుతుందన్నారు.తరతరాలుగా పోరాడి సాధించుకున్న రిజర్వేషన్లను కేంద్రం నీరుగారుస్తుందన్నారు.మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అంశాన్ని మూలన పడేసిందని బేటి పడావో బేటి బచావో అని ఒక వైపు చెబుతూనే మహిళలపై అత్యాచారం చేసిన వారిని నిసిగ్గుగా వదిలిపెడుతుందన్నారు. చట్ట చట్టబద్ధంగా  రావాల్సిన హక్కుల కోసం,సామాజిక తరగతులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడిని ఐక్య ఉద్యమాల ద్వారా పోరాడి తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగిస్తుందన్నారు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునేందుకు మూడు లక్షల రూపాయలు ఎలా సరిపోతాయని ప్రతి ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.57 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని, నిరుద్యోగ భృతి వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు మంజూరు చేయాలని, ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీని  అమలు చేయాలని డిమాండ్ చేశారు.