అంచెలంచెలుగా అభివృద్ధి పనులు..

అంచెలంచెలుగా అభివృద్ధి పనులు..
  • గ్రామాల్లో మట్టిరోడ్లు కనిపించొద్దు..
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..
  • రూ.1.54 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని, రానున్న రోజుల్లో గ్రామాల్లో మట్టిరోడ్లు కనిపించొద్దని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం రూ.1.54 కోట్ల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. మండలంలోని పర్లపెల్లిలో  గౌడ కమ్యూనిటీ హాల్, అంతర్గత రోడ్డు పనులు, పెద్దకొమటిపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు,  ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణం, గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు, ఆకినపల్లిలో అంతర్గత రోడ్లు, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణ పనులు, ఇప్పలపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు, అంతర్గత రోడ్ల పనులు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెల్లో దాదాపుగా మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రత, లైటింగ్స్, అభివృద్ధి పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేసిందని, దీని ఫలితంగా దేశంలో నిర్వహించిన ఉత్తమ గ్రామ పంచాయతీల్లో మొదటి వరుసలో తెలంగాణ పల్లెలు నిలిచాయని చెప్పారు. ప్రతి గ్రామానికి రైతు వేదికలు నిర్మించి రైతులను సంఘటితం చేసి, ఆహ్లాదకరమైన వాతావరణం  కోసం పల్లె పకృతి వనాలు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు