ఆదివాసీల అభ్యున్నతికి అందరూ తోడ్పడాలి

ఆదివాసీల అభ్యున్నతికి అందరూ తోడ్పడాలి

మహాదేవపూర్, ముద్ర: ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వాలు సంస్థలు ముందుకు రావాలని ఆదివాసీలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని, పోడు భూములకు పట్టాలి ఇవ్వటంతో పాటు విద్యా, ఉపాధి రంగాలలో సముచిత ప్రాధాన్యం కల్పించాలని ఆదివాసి నాయకులు కోరారు. అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని కొమరం భీం విగ్రహానికి ఆదివాసి నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జల్, జంగల్, జమీన్ నినాదం తో నిజాం నిరంకుశ పాలనకు  వ్యతిరేకంగా కొమురం భీం సాగించిన పోరాటం ఆదివాసీలలో చైతన్యం నింపుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆయన పోరాట స్ఫూర్తిగా ప్రభుత్వాలు ఆదివాసీలను అభివృద్ధి పథంలో నడిపించాలని, ప్రభుత్వాలు ఆదివాసుల డిమాండ్లపై దృష్టి సారించి ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల కోసం త్యాగాలు చేసిన అమరుల ఆశయాలను నెరవేర్చి సామాన్య ఆదివాసీలలో ఆత్మ ధైర్యం నింపాలని వీరు కోరారు.

ఈ కార్యక్రమంలో డిటిడబ్ల్యుఓ ఎర్రయ్య, జిసిసి మేనేజర్ హరిలాల్, ఆదివాసి సంఘం అధ్యక్షులు కుమార్, ఎంపీపీ రాణిబాయి, జడ్పిటిసి గుడాల అరుణ, ఎస్ టి హాస్టల్ మ్యాట్రిన్ నాగలక్ష్మి, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్, మహాదేవపూర్ మండల గిరిజన నాయకుడు కాలనేని రాములు పెద్ద ఎత్తున గ్రామ గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.