50ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమి లేదు..

50ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమి లేదు..
  • ములుగులో మార్పు జరిగితేనే అభివృద్ధి..
  • ప్రతి ఒక్కరు ఆలోచించి బీఆర్ఎస్ కు ఓటు వేయాలి..
  • ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి..

ముద్ర ప్రతినిధి, (ములుగు) జయశంకర్ భూపాలపల్లి:50ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమి లేదు. ఇప్పుడు కొత్తగా చేసేదేమి లేదు. ములుగులో మార్పు జరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరు ఆలోచించి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. ములుగు నియోజకవర్గంలోని వెంకటాపూర్ మండలంలో ఆదివారం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కు ఓటమి భయం పట్టుకుందని, ఊరు ఊరు తిరుగుతూ బీఆర్ఎస్ నాయకులకు తిట్టడమే పనిగా పెట్టుకుందన్నారు. 50ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ మన రాష్టానికి, నియోజక వర్గానికి చేసిందేమైనా ఉంటే ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇప్పుడున్న పథకాలను అప్పుడు ఎందుకు ఆమలు చేయలేదని ప్రశ్నించారు.

సీఎం కేసిఆర్ ఒక్కడే చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణాను సాధించడం జరిగిందని, సాధించిన తెలంగాణ ఆగం కాకూడదని తెలియజేశారు. ఒక పాలకునిగా తెలంగాణ ప్రజల మీద ప్రేమతో రైతు బంధు, రైతు భీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నాడని తెలిపారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధనసరి అనసూయ ములుగు నియోజక వర్గానికి చేయాల్సిన అభివృద్ధి పని గురించి  కనీసం ఒక్కసారైనా సీఎం దృష్టికి తీసుకెళ్లిందా అని ప్రశ్నించారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మన ప్రాంత ప్రజల దగ్గర పోడు భూములను లాక్కొని చెట్లు పెట్టినప్పుడు ఎమ్మెల్యేవే కదా ఏమి చేశావ్ అంటూ ప్రశ్నించారు. ఇచ్చిన మాటకోసం కట్టుబడి పనిచేసే తత్వం నాది, నా కుటుంబానిదన్నారు. నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే మన గ్రామాలకు కావాల్సిన అభివృద్ధి పనులు అన్ని తెచ్చుకుని, సమస్యలను పరిష్కరించుకుందామని తెలియజేశారు. కొత్తగా కేసీఆర్ ప్రవేశ పెట్టబోయే పథకాలలో తెల్లరేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరికి భీమా వర్తిస్తదని, ప్రతి కుటుంబానికి సన్న బియ్యం వస్తాయని, రైతుబంధు సాయం పెంచుకుంటున్నామని తెలిపారు. మీడియా జర్నలిస్టులకు కూడా భీమా పథకం వర్తింప జేసే ఆలోచనలో కేసీఆర్ వున్నారని చెప్పారు. బీఆర్ఎస్ చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రతి ఒక్కరు ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి, నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.

150మంది బీఆర్ఎస్ లో చేరిక..

ఇంటింటి ప్రచారంలో భాగంగా జవహర్ నగర్ లో ఆదివారం నిర్వహించిన ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి సమక్షంలో 150 మంది పార్టీలో చేరారు. చేరినవారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరు సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలకు ఆకర్షతులై పార్టీ లో జాయిన్ అవుతున్నట్టు ఈ సందర్భంగా బడే నాగజ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి సాంబారి సమ్మరావు, జడ్పీటీసీ రుద్రమదేవి అశోక్, మండల పార్టీ అధ్యక్షులు లింగాల రమణారెడ్డి, గ్రామ అధ్యక్షులు, సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.