పోచారంను పర్యాటకంగా అభివృద్ధి చేద్దాం

పోచారంను పర్యాటకంగా అభివృద్ధి చేద్దాం
  • ఇరిగేషన్,, రెవెన్యూ భూములు పరిశీలన
  • వన్యప్రాణి అభయారణ్యం సందర్శించిన కలెక్టర్ రెండు జిల్లాల అధికారులు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులో గల పోచారం వన్యప్రాణి అభయారణ్యం, పోచారం ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి పర్చడంపై జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం దృష్టి సారించింది. బుధవారం మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, కామారెడ్డి జిల్లా ఇరిగేషన్ అధికారి సంయుక్తంగా సందర్శించారు. ఇరిగేషన్, రెవిన్యూ భూములు ఏఏ జిల్లా పరిధిలో ఎంత మేరా  ఉన్నాయో పరిశీలించారు. మెదక్ జిల్లా వైపు ఉన్న 8 ఎకరాల  రెవెన్యూ శాఖ సంబంధించిన భూమిని పర్యాటకశాఖకుప్పగించనున్నారు. ఇందులో పర్యాటక భవనాలతో పాటు టాయిలెట్స్, పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు మధ్యలో ఐలాండ్ వద్ద గల 15 ఎకరాల భూమి కామారెడ్డి జిల్లాకు సంబంధించినది ఉంది. దీన్ని  పర్యాటకులకు అనువుగా అభివృద్ధి పరచనున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న భూములను  పర్యాటకశాఖ తీసుకోనుంది. అడిషనల్ కలెక్టర్ రమేష్, డిఆర్డిఓ, ఇన్చార్జ్ టూరిజం అధికారి శ్రీనివాస్, ఆర్డిఓ సాయిరాం, ఇరిగేషన్ ఎస్ఈ ఏసయ్య, ఈఈ శ్రీనివాసరావు, కామారెడ్డి జిల్లా ఎస్ఈ విద్యావతి, హవెలిఘనాపూర్ తహసిల్దార్ నవీన్ కుమార్, డిఎఫ్ఓ రవిప్రసాద్, ఎఫ్ఆర్ఓ మనోజ్, టూరిజం ఓఎల్డి సత్యనారాయణ, ఆర్డి సాయిలు తదితరులు ఉన్నారు