కరెంటు కష్టాలు తీర్చింది కెసిఆర్

కరెంటు కష్టాలు తీర్చింది కెసిఆర్
  • మహిళలకు ఇబ్బంది లేకుండా నల్లాలు
  • మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:కరెంటు కష్టాలు తీర్చిన ఘనత కెసిఆర్ దేనని మెదక్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేండర్ రెడ్డి అన్నారు. మంగళవారం పాపన్నపేట మండలంలో ప్రచారం నిర్వహించారు.  యూసఫ్ పేట్ గ్రామంలోమాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పద్మాదేవేందర్ రెడ్డికి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆరెపల్లిలో పద్మాదేవేందర్ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతున్న పద్మా దేవేందర్ రెడ్డికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు, పూలు పెట్టి మంగళహారతులు ఇచ్చి మహిళలు ఘన స్వాగతం పలికారు.

పాపన్నపేట మండలం కుర్తివాడ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఇంటింటా ప్రచారం చేశారు. గడిచిన 10 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణను ముందంజలో నడిపిస్తున్నారన్నారు. ఎలక్షన్స్ రాగానే కాంగ్రెస్ నాయకులకు మెదక్ గుర్తుకు వస్తుంది. వాళ్లకు సరైన బుద్ధి చెప్పాలని  ప్రజల్ని కోరారు. మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లాలో జిల్లా కేంద్రం, ఎస్పీ ఆఫీసు, మాతా శిశు హాస్పటల్, రైలు, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, పేదింటి ఆడబిడ్డ కోసం కళ్యాణ లక్ష్మి, వృద్ధులకు పెద్ద కొడుకు లాగా వృద్ధాప్య పెన్షన్, వితంతువులకు ఒక అన్నగా అండగా ఉంటూ, దివ్యాంగులకు తండ్రిలా సేవ అందిస్తున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


దౌలాపూర్ గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా రూపుదిద్దామని, గ్రామంలో అనేక సంక్షేమ పథకాలను అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ భవన నిర్మాణం కూడా పూర్తవుతుందని, గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం కూడా పూర్తయ్యాయని మరిన్ని పనులు పూర్తి చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలన్నారు.