నేటి నుండి బతుకమ్మ ఆటలు షురూ..

నేటి నుండి బతుకమ్మ ఆటలు షురూ..
  • ఎంగిలి పూలతో ముదలై సద్దుల బతుకమ్మతో ముగింపు..
  • తొమ్మిది రోజుల సంబురాల్లో మునిగి తేలనున్న ఆడపడుచులు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబురాలు నేటినుండి ప్రారంభం కానున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి పూజించడం ఈ పండుగ ప్రత్యేకత. మొదటిరోజు ఎంగిలి పూలతో మొదలు కానున్న బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులు ఈ వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా జరుపుకోనున్నారు. బతుకమ్మ సంబురాల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువతీయువకులు పాల్గొంటారు. చివరిరోజును సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు. తొమ్మిది రోజుల్లో రోజుకో పేరుతో ఈ బతుకమ్మను పూజిస్తారు.

1) ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

2) అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

3) ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

4) నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

5) అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.

6) అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.

7) వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

8) వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

9) సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు.

ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ రోజు సాయంత్రం దేవాలయాల్లో పాటలు పాడుతూ ఆటలు  ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. అయితే చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడు, గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళిపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు, తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి.