తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై కాంగ్రెస్ శ్రేణుల ఎదురుచూపులు

తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై కాంగ్రెస్ శ్రేణుల ఎదురుచూపులు
  • ప్రాధాన్యత ఎవరికి సామాజిక వర్గానికి లేక సీనియారిటీకా స్థానికులక లేక స్థానికేతరులకా?
  • టికెట్ ఫైట్ అద్దంకి వర్సెస్ పిడమర్తిగా పోటీ సాగుతుందా?

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో తెలుసుకునేందుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యావత్తు ఆసక్తి చూపుతోంది. ఎవరికి వారే ఫలానా వ్యక్తికే వస్తుందట అనే మాటలు చెబుతూ చర్చలోకి వెళ్తున్నారు .అభ్యర్థుల జాబితా ఖరారు అవుతుంది అంటూ మీడియాలో వస్తున్న వార్తలతో పార్టీ క్యాడర్లో ఉద్వేగం కనిపిస్తోంది .సర్వేల ప్రకారం అభ్యర్థి ఖరారు అన్నారు, కాదు ముఖ్య నాయకులు చెప్పిన వారికి టికెట్ అన్నారు, నేడు ఏకంగా పిసిసి స్థాయి నుండి నియోజకవర్గ ముఖ్య నేతలకు మండల పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ నుండి బూత్ స్థాయి వరకు నాయకులకు ఫోన్ చేసి అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని అభిప్రాయ సేకరణ సైతం జరుగుతున్నట్లు సమాచారం .నియోజకవర్గ ముఖ్య నాయకులు ఎక్కువ శాతం ఓటమిపాలైన వారికి ఇవ్వద్దని కొత్త వారికే ఇవ్వాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. కాదా ముఖ్యంగా బరిలో నిలవాలని ఆశిస్తున్న వారు నియోజకవర్గ ముఖ్య నేతలకు ఎవరైనా ఫోన్ చేసి అడిగితే తమ పేరు చెప్పాలని తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఢిల్లీ స్థాయిలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన అద్దంకి దయాకర్ ఇటీవల పొంగులేటి ఆశీస్సులతో కాంగ్రెస్ లోకి వచ్చిన పిడమర్తి రవి సైతం తుంగతుర్తి సీటు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం.

అందులో భాగంగా పిడమర్తి రవి ఎంపీ కోమటిరెడ్డి, మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిల ఆశీస్సులు పొందారు అనే మాట వినవస్తోంది. అలాగే నియోజకవర్గ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ రేసులో అద్దంకి, పిడమర్తిల మధ్య సాగే సమరంలో ఎవరు పై చేయి సాధిస్తారో లేక వీరిరువురు కాక మరో పేరు ఏమైనా ప్రకటిస్తారా? స్థానికుడా ?స్థానికేతరుడా? గతంలో పోటీ చేసిన వార? కొత్తవారా మాల సామాజిక వర్గమా లేక మాదిగ సామాజిక వర్గమా? లాంటి అనేక ప్రశ్నలు నియోజకవర్గం లో జవాబు కోసం ఎదురుచూస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ జాబితా విడుదల చేస్తారనే మాట వినవస్తున్న అది మొదటి జాబితా కావచ్చని తుంగతుర్తి అభ్యర్థి ప్రకటన ఉండకపోవచ్చు అని పలువురు మాట. అభ్యర్థి ప్రకటనతో పాటు అభ్యర్థి ఎవరో త్వరితగతిన తేలాలని అప్పటిదాకా కాంగ్రెస్ శ్రేణులకు ఉత్కంఠ తప్పదు. ఏది ఏమైనా ఢిల్లీకి చేరిన తుంగతుర్తి అసెంబ్లీ సీటు రాజకీయానికి త్వరలో తెరపడనుందా వేచి చూద్దాం.