ఎలక్షన్ స్టంట్ బడ్జెట్: బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

ఎలక్షన్ స్టంట్ బడ్జెట్: బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
BJP District President Gangadi Krishna Reddy

ముద్ర ప్రతినిధి కరీంనగర్: బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రూపొందించినట్టు స్పష్టంగా అర్థమవుతుందని, బడ్జెట్ పూర్తిగా ఎన్నికల స్టంట్ అంకల గారడి మాత్రమేనని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం ఆయన మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వానికి చివరి బడ్జెట్ కావడంతో రూ.2,90,396 కోట్ల అంకెలతో మాత్రమే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వ హామీలను, వాగ్దానాలను మరిచి పోయి కేటాయింపులు జరిపిందన్నారు. లోగడ సొంత నివాస స్థలం కలిగిన వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం చేస్తామని బి ఆర్ ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించి, నేడు ఆ వాగ్దానాలను హామీని నిలబెట్టుకోకుండా 3 లక్షల చొప్పున సాయం చేస్తామని ప్రకటించడం సరికాదన్నారు.

లోగడ మునుగోడు ఎన్నికల సందర్భంగా గిరిజన బందు పథకాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు బడ్జెట్లో ఆ ఊసే ఎత్తకపోవడం దారుణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు బాకీ పడ్డ నిరుద్యోగ భృతి కి నిధులు కేటాయించకపోవడం, ఏ ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రకటించకపోవడం కెసిఆర్ ప్రభుత్వ బడ్జెట్ తీరుకు అద్దం పడుతుందన్నారు. బడ్జెట్లో జరిగిన కేటాయింపులన్నీ మసి పూసి మారేడు కాయ అనే విధంగా ఉన్నాయి తప్ప, దీంతో ప్రజానీకానికి ఒరిగేది ఏమీ లేదన్నారు.

ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు  కేంద్ర ప్రభుత్వంపై పసలేని పనికిమాలిన ఆరోపణలు చేయడంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ గొంతెమ్మ కోరికలను కేంద్ర ప్రభుత్వం తీర్చాలనే రీతిలో మంత్రి హరీష్ రావు మాట్లాడడానికి సిగ్గుపడాలన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు రావాల్సిన వాటా ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కూడా నిధులు వస్తున్న, పన్నుల రూపేనా రావాల్సిన మొత్తం ప్రభుత్వానికి జమవుతున్న కూడా మంత్రి హరీష్ రావు కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేయడం తగదన్నారు.  అడ్డగోలు అప్పులు  చేసిరాష్ట్రాన్ని  అప్పులమయం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం నేడు బడ్జెట్ సందర్భంగా గొప్పలు చెప్పుకోవడం, దేశానికి దిక్సూచిగా మారామని ప్రగల్బాలు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు.