పీసీబీ పిల్ల చేష్టలు మానుకోవాలన్న కమ్రాన్​ అక్మల్​

పీసీబీ పిల్ల చేష్టలు మానుకోవాలన్న కమ్రాన్​ అక్మల్​

ఇస్లామాబాద్​: వన్డే వరల్డ్ కప్ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. టోర్నీ షెడ్యూల్ విడుదలవగానే.. 'మా గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆడతాం' అని సంచలన వ్యాఖ్యలు చేసిందా బోర్డు. అంతేకాదు, షెడ్యూల్‌ విడుదలకు ముందు కూడా తాము ఆడే రెండు మ్యాచుల వేదికలు మార్చాలని పట్టుపట్టింది. కానీ బీసీసీఐ, ఐసీసీ రెండూ ససేమిరా అన్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ బోర్డుపై ఆ దేశ మాజీ దిగ్గజాలు మండిపడుతున్నారు. పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'పీసీబీ ఇలాంటి పిల్ల చేష్టలు మానుకోవాలి. ఇలాంటి పనుల వల్ల క్రికెట్ స్థాయి తగ్గించకూడదు. మ్యాచ్ జరిగే వేదికలు అసలు సమస్యే కాకూడదు. పిచ్చి సాకులు వెతుక్కోకూడదు' అని అక్మల్ ఆ దేశ క్రికెట్ బోర్డును తిట్టిపోశాడు. పాక్ లెజెండ్ వసీం అక్రమ్ కూడా ఈ విషయంలో పీసీబీపై నిప్పులు చెరిగాడు. 'ఈగోలకు పోవడానికి నేను ఎప్పుడూ రెడీ. నీకు ఈగో ఉండి, జరుగుతున్నది తప్పు అనిపిస్తే ముందుకొచ్చి చెప్పు. ఆ తర్వాత ఇక దాన్ని వదిలేయాలి. మనం చేయాలని అనుకున్నది సాధ్యమా? చేయగలమా? అని డిసైడ్ అవ్వాలి. జరిగేది అయితే వెనకడుగు వేయకూడదు. జరగనిదైతే వదిలేయాలి. లేదంటే దేశం నవ్వులపాలు అవుతుంది' అని అక్రమ్ చెప్పాడు.'మనందరికీ దేశంపై ప్రేమ ఉంటుంది. కానీ ఇది ఒక ఆట మాత్రమే. ప్రభుత్వాల మధ్య ఏమైనా ఉంటే.. వాళ్లు మాట్లాడుకుంటారు. వేదికల విషయంలో అసలు ఇష్యూ ఏం లేదు. పాక్ ఎక్కడ ఆడాలని నిర్వాహకులు చెప్తే.. అక్కడే టీం ఆడుతుంది. అది సింపుల్. మేం అహ్మదాబాద్‌లో ఆడం, ఇక్కడ ఆడం, అక్కడ ఆడం ఇలాంటి వేస్ట్ మాటలు అనవసరం. ఒకసారి ప్లేయర్లను అడిగితే వాళ్లు ఈ విషయాలు అసలు పట్టించుకోరు' అని చెప్పాడు.