ఢిల్లీలో రేవంత్ రెడ్డి.. సోనియా గాంధీను కలవనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీలో రేవంత్ రెడ్డి.. సోనియా గాంధీను కలవనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర,తెలంగాణ:-తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి, సత్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ మాజీ చీఫ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని కలిసేందుకు రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సోమవారం కేరళకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచి రాత్రి దేశ రాజధానికి చేరుకున్నారు. జూన్‌ 2న నిర్వహించనున్న ఉత్సవాలకు రావాల్సిందిగా సోనియా గాంధీని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా ఆహ్వానించనున్నారు.

అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిసి వారిని కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం పంజాబ్ లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి పంజాబ్ వెళతారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. మంగళవారం సాయంత్రానికి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఆరోగ్య కారణాలతో పాటు జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సోనియా గాంధీ హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.