పాము కాటుతో మంథనిలో మహిళ మృతి

నాగుల చవితి రోజున పుట్టకు పాలు పోసి ఇంటికి వచ్చిన రోజే ఘటన.. మంథని ముత్యాలమ్మ వాడలో విషాదం
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మంథని పట్టణంలోని ముత్యాలమ్మ వాడలో హృదయ విదారకర సంఘటన చోటుచేసుకుంది. నాగుల చవితి పురస్కరించుకొని పుట్టలో పాలు పోసి ఇంటికి వచ్చిన మహిళ పాము కాటుకు బలయింది. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మంథని పట్టణంలోని కోర్టు సమీపంలో గల ముత్యాలమ్మ వాడ లో నివాసం ఉంటున్న బోడెల్ల దశరథం భార్య భారతి అనే మహిళ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పాముకాటుతో మృతి చెందింది. అంతకు ముందు ఉదయం నాగుల చవితి పురస్కరించుకొని పుట్టకు పాలు పోసి ఇంటికి వచ్చిన భారతి రాత్రిపూట ఇంట్లో నిద్రిస్తుండగా అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ నాగుపాము భారతి భుజం మీద కాటు వేసింది. అది గమనించని భారతి కొద్దిసేపటికి అపస్మార్క స్థితిలోకి చేరుకోవడంతో ఇంట్లోని వారు లేచి చూడగా ఇంట్లో నాగుపాము కనిపించడంతో గుర్తించి బంధించారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న భారతిని హుటాహుటిన గోదావరిఖనిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించలోగా మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగుల చవితి రోజున ఈ ఘటన జరగడం మంథనిలో విషాదం నెలకొంది.