BREAKING: 17 రోజుల యాత్ర... 21 రోడ్ షోలు

  • కేసీఆర్ బస్సు యాత్ర నేడే ప్రారంభం

 ముద్ర, తెలంగాణ బ్యూరో: భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) బుధవారం నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. తెలంగాణ ప్రగతి రథం పేరుతో రూపొందించిన బస్సులో ఆయన రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తారు. మొత్తం 17 రోజుల పాటు సాగే బస్సు యాత్ర సందర్భంగా 21 చోట్ల రోడ్ షోలలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ప్రణమిల్లిన తర్వాత బస్సు యాత్ర కొనసాగిస్తారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మిర్యాలగూడలో తొలి రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఇలా 17 రోజుల పాటు కొనసాగే ఆయన బస్సు యాత్ర మే 10న సిద్ధిపేట రోడ్ షోతో ముగుస్తుంది. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి లేదా రెండు అసెంబ్లీలను టచ్ చేస్తూ రోడ్ షోలు నిర్వహిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకురావడానికి ఆయన వ్యూహం పన్నుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో మే 13న పార్లమెంటు ఎన్నికలు జరగనున్నయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.