సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు నామినేషన్...

సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు నామినేషన్...

ఏలూరు: ఇండియా కూటమి పక్షాలు సిపిఎం, కాంగ్రెస్, భారత్ బచావో, ఆమ్ ఆద్మీ పార్టీలు  బలపరిచిన  సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు ఏలూరు  నియోజకవర్గ  శాసనసభ స్థానానికి మంగళవారం పార్టీ ఆనందోత్సాహాలు, కోలాహలం మధ్య నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ముక్కంటికి అందజేశారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ర్యాలీని అక్కినేని వనజ పార్టీ జండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బికెఎంయు) గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, ఏలూరు జిల్లా ఇన్చార్జి అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య,  కోనసీమ అంబేద్కర్ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు, పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య,సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి అరటికట్ల రవి,కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్రావు, భారత్ బచావో నాయకులు గుబ్బల నాగేశ్వరరావు, ఇండియా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, సిపిఐ, సిపిఎం, ప్రజా సంఘాల నేతలు మద్దతు ప్రకటించారు. 

నామినేషన్ అనంతరం బికెఎంయు గౌరవాధ్యక్షులు జల్లి విల్సన్ మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతున్న బండి వెంకటేశ్వరరావుకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అక్కినేని వనజ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి స్థానికంగా పరిచయాలు గల బండి వెంకటేశ్వరరావును గెలిపించడం ద్వారా సమస్యలను పరిష్కరించకోగలుగుతామని తెలిపారు. ఏలూరు నగరాభివృద్ధి సిపిఐ అభ్యర్థి విజయంతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా బూర్జువా పార్టీల తరఫున ఎమ్మెల్యేలుగా పని చేశారని వీరి హయాంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావును కంకి కొడవలి గుర్తుపై, ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్యకు హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

సిపిఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో సిపిఐ తరఫున ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన వీరమాచనేని విమలాదేవి, అత్తులూరి సర్వేశ్వరరావు లాంటి ఉద్దండుల స్ఫూర్తితో ప్రజల పక్షాన నిలిచి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, బత్తుల వెంకటేశ్వరరావు, బాడిస రాము, మైసాక్షి వెంకటాచారి, కారందారయ్య, సన్నేపల్లి సాయి బాబా,కంచర్ల గురవయ్య, జమ్మి శ్రీనివాసరావు, జేవి రమణ రాజు, కొండేటి బేబి, రాష్ట్ర సమితి సభ్యులు నెక్కంటి సుబ్బారావు, కలిశెట్టి వెంకట్రావు,

ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ యామిని, ఏఐటీయూసీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్  డాంగే, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కుంచే వసంతరావు,సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్, అడ్డగర్ల లక్ష్మి ఇందిర, మావూరి విజయ, రైతుకు నీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నుండి దండు బోయిన చంద్రశేఖర్, మూర్తి, సిపిఎం నగర కార్యదర్శి పి. కిషోర్  తదితరులు పాల్గొన్నారు. 

ఉత్సాహంగా ర్యాలీ...
స్థానిక పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు ఉదయం గం.10.30కి సిపిఐ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. ర్యాలీని అక్కినేని వనజ పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఎర్ర టోపీలు, గొడుగులు ధరించి, సిపిఐ జండాలు చేతబూని ఎండను సైతం లెక్కచేయకుండా వడివడిగా నడుస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఎర్ర చీరలు ధరించిన మహిళలు, వాలంటీర్లు ర్యాలీని క్రమశిక్షణతో సమన్వయం చేస్తూ కమ్యూనిస్టు పార్టీ సత్తా చాటారు.

వాసవి సిల్క్స్, మెయిన్ బజార్, బిర్లాభవన్ సెంటర్, బంగారం షాపుల రోడ్డు, గడియార స్తంభం,కుండీ సెంటర్, మీదుగా తాసిల్దార్ కార్యాలయం వరకు అధ్యంతం ఉత్సాహబరితంగా ర్యాలీ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి కళాకారుల డబ్బులతో ర్యాలీ సాగింది.