గణతంత్రం ఘనంగా జరగాల్సిందే రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

గణతంత్రం ఘనంగా జరగాల్సిందే  రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
high court verdict on republic day celebrations

    తెలంగాణ రాష్ట్రంలో గురువారం గణతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. అ మేరకు బుధవారం కీలక ఆదేశాలను జారీ చేసింది. కేంద్రం మార్గదర్శకాల మేరకు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పరేడ్ సహా వేడుకలను నిర్వహించడమే కాకుండా వాటిని చూసేందుకు ప్రజలను కూడా అనుమతించాలని సూచించింది. కరోనా కారణంగా వేడుకలు బహిరంగంగా జరపడం లేదన్న అడ్వకేట్ జనరల్ వాదనను హైకోర్టు అంగీకరించలేదు. ఎక్కడెక్కడ కొవిడ్ ఆంక్షలు అమలులో ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించింది.

    కరోనా కారణంగా రాజ్ భవన్ లోనే వేడుకలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం 13వ తేదీనే  లేఖ రాసిందని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరవుతారని విన్నవించారు. అవసరమైతే అక్కడ నుంచి వేడుకలను వెబ్ కాస్టింగ్ చేస్తామన్నారు. అయితే, హైకోర్టు దీనికి అంగీకరించలేదు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శలన్నింటిని పాటించి తీరాలని స్పష్టం చేసింది. గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించకుండా ఆపలేమని తేల్చి చెప్పింది. ఇది జాతీయ పండుగ కాబట్టి, దేశభక్తి ఉట్టిపడే పండుగ కాబట్టి ఆ స్ఫూర్తిని చాటేలా వేడుకలు ఘనంగా జరపాల్సిందేనని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి