కేసీఆర్ మోడీ లు ఒకే తాను ముక్కలే

కేసీఆర్ మోడీ లు ఒకే తాను ముక్కలే
  • బొగ్గు బావుల అమ్మకం ప్రజా ద్రోహం
  •  ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షులు సాదినేని

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కార్మికుల హక్కులను హరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓకే తాను ముక్కలలా వ్యవహరిస్తున్నాయని ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షులు సాధినేని వెంకటేశ్వరరావు విమర్శించారు. శనివారం రైటర్ బస్తీలోని ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర,రాష్ట్రంలో అధికారం లో ఉన్న ఉన్న ప్రభుత్వాలు కార్మికులకు ద్రోహం చేస్తున్నాయని బొగ్గుబావులు,వనరులు, భూములు,ఖనిజసంపదలు, పరిశ్రమలను,ప్రజల ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నాయని ఆరోపించారు. దేశ ప్రజల ప్రయోజనాలను విస్మరించి పిడికెడు మంది కార్పొరేట్ సంస్థలకు మోడీ  సర్కార్ గులాంగిరి చేస్తుందని దుయ్య బట్టారు. కార్మిక , ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న పాలకులకు తగిన రీతిలో బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 2,3లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఐఎఫ్టియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని అన్నివర్గాల ప్రజలకు,కార్మికులకు  విజ్ఞప్తి చేశారు.

 దేశంలో లాభాలతో నడుస్తున్న బొగ్గుగనులను కార్పొరేట్ సంస్థలకు మోడీ ప్రభుత్వం కట్టబెట్టిందన్నారు. అక్రమ ఆస్తులు,నేరాలు,దోపిడీ,మోసాలకు పాల్పడిన అధానీని కాపాడేందుకు మోడీ ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుందని ఆరోపించారు. బొగ్గు గనుల పరిరక్షణ కోసం, *ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ రంగాలలో పనిచేస్తున్న కార్మిక సంఘాల అంతర్జాతీయ మైనింగ్ కాన్ఫరెన్స్ ఆగస్టులో జర్మనీలో జరగబోతుందని ఆయన వివరించారు. మహాసభలో  గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొనబోతున్నారని సాదినేని తెలిపారు.