కెసిఆర్ ను గద్దె దించేంతవరకు పోరాడాలి బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ

కెసిఆర్ ను గద్దె దించేంతవరకు పోరాడాలి బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అన్ని వర్గాల ప్రజల ను ఇబ్బందులకు గురి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ను గద్దె దించేంతవరకు పోరాడాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ పిలుపునిచ్చారు.
శుక్రవారం  భారతీయ జనతా పార్టీ  ఆధ్వర్యంలో గ్రూప్ వన్ , ఇతర పోటీ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టాలని, టీఎస్పీఎస్సీ చైర్మన్ ని తొలగించి  కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బస్టాండ్ సెంటర్లో  రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగాకోనేరు  మాట్లాడుతూ  ఎందరో అమరుల త్యాగఫలంతో తెలంగాణ వచ్చిందన్నారు. అమరుల త్యాగాలను విస్మరించిన కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

BRS ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో ఉద్యోగాలు రాక విద్యార్థులు నాన్న ఇబ్బందులకు గురవుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు.   ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అన్నా కెసిఆర్ హామీ నేటి వరకు అమలు కాలేదని విమర్శించారు. ప్రభుత్వం విద్యార్థుల బతుకులుతో చెలగాటం  ఆడడం సరైంది కాదన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల నష్టపోయిన విద్యార్థులకు లక్ష రూపాయలు  చెల్లించాలని, లేని పక్షంలో విద్యార్థుల తరఫున బిజెపి ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షలలో బిజెపి నాయకులు ఎడ్లపల్లి శ్రీనివాస్ కుమార్, ఆకుల నాగేశ్వరావు గౌడ్,  సతీష్, కిరణ్, అనిల్ కుమార్, బానోత్ గణేష్,  లక్ష్మణ్ అగర్వాల్, రాయుడు నాగేశ్వరరావు,  రవీందర్, నరేంద్రబాబు, బాలగోని గోపికృష్ణ గౌడ్, ఓబీసీ నాయకులు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.