ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించాలి: రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ కృష్ణ

ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించాలి: రాష్ట్ర అధ్యక్షులు  జాటోత్ కృష్ణ
employment guarantee scheme

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రెండు లక్షల 75 వేల కోట్ల బడ్జెట్ను కేటాయించాలని AIPKMS రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ కృష్ణ డిమాండ్ చేశారు. ఏఐపీకే మిస్ఆధ్వర్యంలో లక్ష్మీదేవి పల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించి ఎంపీడీవో కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గతం కంటే బడ్జెట్ను కుదించి నిరుపేదల పొట్టలు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు . గతంలో 83 వేల కోట్లు రూపాయలు కేటాయించగా ప్రస్తుతం బడ్జెట్లో 23 వేల కోట్లు తగ్గించి కేవలం 60 వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకోగా ఆ చట్టానికి తూట్లు పొడుస్తూ దొడ్డి దారిన చట్టాన్ని ఎత్తివేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు.

పథకం ప్రారంభమైన కొత్త లో ఎక్కువ బడ్జెట్ ను కేటాయించి రాను రాను ఒకపక్క పని భారాన్ని పెంచుతూ మరోపక్క పూర్తిస్థాయిలో బడ్జెట్ను తగ్గించి పేదల నోటి కాడ కూడును గుంజుకోవడం ఏమి న్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు . నేడు కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేదలపై భారాన్ని మోపారని మరోపక్క విద్యుత్ ఛార్జీలు పెంచి పేదలు మరియు రైతుల నడ్డి విరుస్తున్నారని ఉపాధి హామీ పథకంలో బడ్జెట్ను తగ్గించి మరింత భారాన్ని పేదలపై మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికే కోట్ల రూపాయలు గత బకాయిలు పేదలకు చెల్లించకుండా పేదల రెక్కల కష్టం డబ్బులను వేరే పథకాలకు పెట్టి పేదలనోళ్లు కొట్టడమే కాకుండా ఇప్పుడు కూడా బడ్జెట్ను తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా పేదల గోడును అర్థం చేసుకొని ఉపాధి హామీ పథకానికి రెండు లక్షల 75 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని , పని ప్రదేశాలలో టెంట్లు, మెడికల్ కిట్లు పని పరికరాలు ఇవ్వాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని , పని ప్రదేశాల్లో ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే పేదలకు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . డిమాండ్ల సాధన కోసం రాబోయే కాలంలో ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు .ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు ఆజాద్ ,రాజశేఖర్, ఆదిలక్ష్మి , బాడిషా పాపారావు , వెలగల నరసింహారావు ,బానోతు ధర్మ తదితరులు పాల్గొన్నారు .